యూపీ యువతకు యోగి సర్కార్ దీపావళి కానుక ... ఏమిటో తెలుసా?

By Arun Kumar PFirst Published Oct 25, 2024, 5:33 PM IST
Highlights

ఇటీవల వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించిన యువతకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియామక పత్రాలు అందజేశారు.  ఇలా దీపావళి పండక్కి ముందే యువత జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చారు. 

లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యువతకు దీపావళి కానుక అందజేసారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన నియాామకాల్లో ప్రతిభ చూపించి ఉద్యోగాలు సాధించిన యువతకు స్వయంగా తన చేతులమీదుగా నియామక పత్రాలు అందజేసారు సీఎం. ఇలా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల జీవితాల్లో దీపావళికి ముందే వెలుగులు నిండాయి. 

ఈ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ... కొంతమంది అభ్యర్థులు 2017 కంటే ముందు కూడా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుని ఉంటారన్నారు. వారికి ఉద్యోగాలు సాధించేందుకు అన్ని అర్హతలు, సామర్థ్యం ఉన్నప్పటికీ... పలుకుబడి, డబ్బు లేకపోవడంతో రాలేవని అన్నారు. గతంలో అన్ని అర్హతలు ఉన్నా ఎంపిక ప్రక్రియ నుండి తొలగించేవారని సీఎం ఆరోపించారు.

Latest Videos

అయితే గత ఏడున్నర సంవత్సరాల్లో ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి వివక్ష చూపలేదని ... అర్హులకే ఉద్యోగాలు దక్కుతున్నాయని యోగి పేర్కొన్నారు. ప్రభుత్వ, కాంట్రాక్ట్ మాత్రమే కాదు ప్రైవేట్ ఉద్యోగ నియామకాాల్లో కూడా పారదర్శకత పెరిగిందని... ఇలా తాజాగా 1950 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ ద్వారా 1526 మంది గ్రామ పంచాయతీ అధికారులు, 360 మంది గ్రామాభివృద్ధి అధికారులు (సామాజిక సంక్షేమం), 64 మంది సామాజిక సంక్షేమ పర్యవేక్షకులు ఎంపికయ్యారని యోగి తెలిపారు.

 పారదర్శకతతో ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ జరిగింది... ఇలాగే ప్రతి విషయంలోనూ పనిచేస్తే ఉత్తరప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధి గల దేశంగా మారుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

యోగి సర్కార్ ఇప్పటివరకు చేపట్టిన ఉద్యోగాలెన్నంటే...

అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడున్నరేళ్లలో తమ ప్రభుత్వం దాదాపు 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని సీఎం యోగి తెలిపారు. రాష్ట్రంలో మెరుగైన భద్రతా వాతావరణం కారణంగా ప్రైవేట్ రంగంలోనూ లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు పెరిగాయని అన్నారు. గతంలో ఉద్యోగాల కోసం యువత దేశవిదేశాలు తిరిగేవారని, ఇప్పుడు స్వరాష్ట్రంలోనే, సొంత జిల్లాలోనే ఉద్యోగాలు దొరుకుతున్నాయని,... దీంతో ఇంటి పనులతో పాటు ఉద్యోగం, కుటుంబాన్ని కూడా చూసుకుంటున్నారని సీఎం యోగి అన్నారు. ఎంపికైన గ్రామ పంచాయతీ అధికారులు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన అభ్యర్థులకు వారి స్వగ్రామంలోనే ఉద్యోగాలు లభించాయని చెప్పారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలో పారదర్శక నియామక ప్రక్రియ కీలకమని సీఎం యోగి అన్నారు. మంచి, సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయకపోతే ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన వ్యవస్థ పక్షవాతం అవుతుందని అన్నారు. ఇలా జరగకుండా ఉండేందుకు 2017లోనే అన్ని కమిషన్లు, బోర్డులు రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు.

దేశం 2047లో స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే సమయానికి స్వయం సమృద్ధి గల, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలనేది ప్రధాని మోదీ లక్ష్యమని సీఎం అన్నారు. ఇది ఉద్యోగులు వేసే పునాదిపైనే ఆధారపడి ఉంటుందని, మన గ్రామ పంచాయతీలు కూడా దానికి పునాది రాళ్లేనని అన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు 29 రకాల పనులు అప్పగించామని చెప్పారు.

గ్రామ సమస్యలకు గ్రామాల్లోనే పరిష్కారం

గతంలో గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు ఉండేవి కావు, గ్రామ ప్రధాన్ ఇంటి నుండే పనిచేసేవారు, దీనివల్ల చాలా సార్లు పనులు జరిగేవి కావు, డబ్బు వృథా అయ్యేదని సీఎం అన్నారు. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో 57 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు నిర్మితమయ్యాయని... వాటిలో ఆప్టికల్ ఫైబర్, ఇంటర్నెట్, వైఫై సౌకర్యాలు కల్పించామని, కంప్యూటర్ ఆపరేటర్లను నియమించామని చెప్పారు. గ్రామ సమస్యలకు గ్రామాల్లోనే పరిష్కారం దొరకాలని, ఆదాయం, కులం, నివాస ధ్రువపత్రాలు వంటివి ఆన్‌లైన్‌లోనే లభించాలని... గ్రామ ప్రధాన్, ఇతరులతో కలిసి ఏడాది పొడవునా గ్రామ పంచాయతీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు.

ప్రతి గ్రామ పంచాయతీలోనూ స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉందని సీఎం యోగి అన్నారు. గ్రామ పంచాయతీల వద్ద కొంత భూమి ఉంటుందని, గ్రామాల్లో సంతలు ఏర్పాటు చేయాలని, గ్రామంలోని మురుగునీటిని స్థానిక పద్ధతుల ద్వారా శుద్ధి చేయాలని, చెరువుల్లో చేపల పెంపకం ద్వారా గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని సీఎం సూచించారు.

రాష్ట్రంలో 17 నగరాలు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామ పంచాయతీలు కూడా స్మార్ట్ అవ్వొచ్చని సీఎం యోగి అన్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్యం, చెత్త నిర్వహణ చేపట్టాలని, విద్యుత్ సంస్థతో మాట్లాడి కీలక ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

గతంలో చెత్తను పారబోసేందుకు గ్రామ పంచాయతీల వద్ద ఎరువు గుంతలు ఉండేవి, వాటిని తిరిగి తవ్వాలని సూచించారు. రిజర్వ్ భూమిలో ఎరువు గుంతలు, గోచర భూమి, నిరాశ్రిత పశువుల కోసం గోశాలలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని వారి జాబితా తయారు చేయాలని సూచించారు, ప్రతి పేదవారికీ లబ్ధి చేకూర్చాలని, దీనివల్ల ప్రజలకు అధికారులపై, వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని అన్నారు.

పేదవారి ఆశీర్వాదం విజయానికి దారితీస్తుంది, వారిని దోచుకుంటే శాపాలు కూడా తగులుతాయని హెచ్చరించారు., జీవితం ఆశీర్వాదాలు పొందడానికి, విజయం సాధించడానికి వుంది... అపకీర్తి పాలవ్వడానికి కాదన్నారు. అపకీర్తితో జీవితం నరకప్రాయం అవుతుందని సీఎం యోగి అన్నారు.

గ్రామ సచివాలయాల ద్వారా అదనపు ఆదాయ మార్గాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని సీఎం యోగి అన్నారు. అక్కడ కమ్యూనిటీ సెంటర్లు, గ్రామ సమావేశాలు నిర్వహించవచ్చని, రుసుము వసూలు చేసి గ్రామస్తులకు సౌకర్యాలు కల్పించవచ్చని, దీనివల్ల గ్రామానికి ఆదాయం వస్తుందని సూచించారు.

 ఆ తెగకు చెందిన యువకుడికీ ఉద్యోగం

సామాజిక సంక్షేమ శాఖకు చాలా పెద్ద బాధ్యత ఉందని, 21 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తోందని అన్నారు. అలాగే సామూహిక వివాహాలు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు షెడ్యూల్డ్ కులాలు, తెగల యువతకు కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయని సీఎం అన్నారు. లఖింపూర్ ఖేరీలోని థారు తెగకు చెందిన యువకుడికి కూడా నియామక పత్రం అందించామని, పెద్ద సంఖ్యలో మహిళలకు ఉద్యోగాలు లభించడం మహిళా సాధికారతకు నిదర్శనమని సీఎం అన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఓంప్రకాష్ రాజ్‌భర్, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అసీం అరుణ్, సామాజిక సంక్షేమ శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ గోండ్, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్, వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ మోనికా ఎస్. గార్గ్, అదనపు ప్రధాన కార్యదర్శి (పంచాయతీరాజ్) నరేంద్ర భూషణ్, ప్రిన్సిపల్ సెక్రటరీ (సామాజిక సంక్షేమం) డా. హరిఓం, ప్రిన్సిపల్ సెక్రటరీ (నియామకాలు & సిబ్బంది) ఎం. దేవరాజ్, సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ ఇన్‌చార్జి ఛైర్మన్ ఓఎన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 యోగి చేతులమీదుగా నియామక పత్రాలు అందుకున్నది వీళ్లే

గ్రామ పంచాయతీ అధికారిగా ఎంపికైన అవనీష్ తివారీకి బారాబంకీలో, ఆమిర్ అలీ సిద్ధిఖీకి హర్దోయ్‌లో, రూబీ మిశ్రాకు మహోబాలో, నీతేష్ సింగ్‌కు గోరఖ్‌పూర్‌లో, అఖిలేష్ సిద్ధార్థ్‌కు అయోధ్యలో, నిధికి గోరఖ్‌పూర్‌లో, అరవింద్ సింగ్ రాణాకు అమేథీలో, దినేష్ కుమార్ మౌర్యకు వారణాసిలో నియామకాలు లభించాయి. గ్రామాభివృద్ధి అధికారిగా దివ్యకు కన్నౌజ్‌లో, కన్హయ్య లాల్ గౌతమ్‌కు గోరఖ్‌పూర్‌లో, ప్రాచి పాఠక్‌కు సుల్తాన్‌పూర్‌లో నియామకాలు లభించాయి. వీరందరికీ ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు.

:

 

click me!