మహారాష్ట్ర సీఎంకు సూసైడ్ అటాక్ ముప్పు.. ఏక్‌నాథ్ షిండే నివాసాల్లో భద్రత పెంపు

By Mahesh KFirst Published Oct 2, 2022, 7:44 PM IST
Highlights

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేపై హత్యా ప్రయత్నం జరుగుతుందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖ ఇన్‌పుట్లు ఇచ్చింది. దీంతో పోలీసులు వెంటనే భద్రత పెంచారు. ఆయన నివాసాల్లో భద్రతను పెంచారు. ఈ ముప్పును సీఎం షిండే ధ్రువీకరించారు.
 

ముంబయి: మహారాష్ట్రలో దసరా ర్యాలీ నిర్వహించనున్న తరుణంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ కీలక సూచనలు చేసింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను సూసైడ్ స్క్వాడ్ ద్వారా హతమార్చే ముప్పు ఉన్నదని ఇన్‌పుట్స్ ఇచ్చింది. దీంతో పోలీసులు ముందే అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీని పెంచారు. 

ఈ ముప్పును సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా ధ్రువీకరించారు. తనకు గతంలోనూ ఇలాంటి బెదిరింపులు వచ్చాయని ఆయన వివరించారు. నక్సల్స్, దేశవ్యతిరేక శక్తుల నుంచి తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా బెదిరింపులు వచ్చాయని చెప్పారు. 

‘నేను గతంలోనూ ఇలాంటి బెదిరింపులకు తాను భయపడలేదు. ఇప్పుడు కూడా భయపడను. భవిష్యత్‌లో ఇలాంటి బెదిరింపులు వచ్చినా భయపడను. రాష్ట్ర హోం శాఖ, పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు’ అని ఆయన తెలిపారు.

తాను ప్రజల మనిషి అని, ప్రజలతో మమేకం కాకుండా తనను ఎవరూ ఆపలేరని సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. ‘ఇది సెక్యూరిటీ సంబంధ సమస్య. రాష్ట్ర హోం మంత్రి, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూను హ్యాండిల్ చేయగల సమర్థుడు. హోం శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. అది సక్సెస్ కాదు’ అని పేర్కొన్నారు.

మలాబార్ హిల్‌లోని సీఎం అధికారిక నివాసం వర్ష రెసిడెన్సీ, థానేలోని ఆయన వ్యక్తిగత నివాసాల్లో భద్రతను పెంచారు.

మంత్రాలయలోని ఏక్‌నాథ్ షిండే కార్యాలయానిక గత నెలలో ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ఆషాది ఏకాదశి సందర్భంలోనూ సీఎంకు బెదిరింపు లేఖ వచ్చినట్టు తెలిసింది.

click me!