మన దెబ్బ గట్టిగానే తగిలిందిగా.. ఒక్క టిక్‌టాక్ వల్ల చైనాకు ఎంత నష్టమో తెలుసా..?

By Siva KodatiFirst Published Jul 2, 2020, 4:52 PM IST
Highlights

59 చైనా యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించడంతో బీజింగ్ రగిలిపోతోంది. ఇండియా నిర్ణయంతో పలు చైనా కంపెనీలు తీవ్రమైన నష్టాన్ని చవి చూస్తున్నాయి. 

59 చైనా యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించడంతో బీజింగ్ రగిలిపోతోంది. ఇండియా నిర్ణయంతో పలు చైనా కంపెనీలు తీవ్రమైన నష్టాన్ని చవి చూస్తున్నాయి. చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. టిక్‌టాక్, విగో వీడియో, హలో వంటి చైనా యాప్‌లను నిషేధించడం వలన వాటి మాతృసంస్థ ‘‘ బైట్ డాన్స్‌’’కు ఘోరమైన ఎదురుదెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది.

ఆ సంస్థ దాదాపు 6 బిలియన్ డాలర్ల వరకు నష్టపోయినట్లు ‘‘గ్లోబల్ టైమ్స్’’ నివేదిక తెలిపింది. గత కొన్ని సంవత్సరాల్లో, బైట్ డాన్స్ కంపెనీ దాదాపు 1 బిలియన్ డాలర్లకు పైగా భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

మొబైల్ యాప్స్ విశ్లేషణ సంస్థ ‘‘సెన్సార్ టవర్’’ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. టిక్‌టాక్‌ను భారతదేశంలో మే నెలలో 112 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తన నివేదికలో తెలిపింది.

ఇది భారత మార్కెట్లలో 20 శాతం అని వెల్లడించింది. దీని సంఖ్య అమెరికాలో డౌన్‌లోడ్ చేసుకున్న దాని కంటే రెట్టింపు అని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. కాగా భారతదేశంలో 59 యాప్‌లను నిషేధించాలని భారత ప్రభుత్వం జూన్ 29న ఆదేశాలు జారీ చేసింది.

దేశానికి వెలుపల ఉన్న సర్వర్లకు వినియోగదారుల డేటాను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫ్లాట్ ఫామ్‌లలో అందుబాటులో ఉన్న కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా అందిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని భారత ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అందువల్లే ఆ యాప్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 

click me!