బౌద్ధ మత నిర్మూలనకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది: దలైలామా సంచలన ఆరోపణలు

By Mahesh KFirst Published Jan 1, 2023, 2:30 PM IST
Highlights

చైనా ప్రభుత్వం బౌద్ధ మతాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నదని, ఒక పద్ధతి ప్రకారం ఈ నిర్మూలన చర్యలు ఉంటున్నాయని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. కానీ, అది ప్రజల విశ్వాసాన్ని అణచివేయలేదని వివరించారు.
 

న్యూఢిల్లీ: బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు, టిబెటన్ లీడర్ దలైలామా శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రభుత్వం బౌద్ధ మతాన్ని నిర్మూలించడానికి ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఈ పని చేస్తున్నదని తెలిపారు. కానీ, బుద్ధుడిపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని అది అణచివేయలేదని వివరించారు. అది సాధ్యం కావట్లేదని పేర్కొన్నారు.

చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఇటీవలే బౌద్ధ మతానికి చెందిన మూడు విగ్రహాలను కూల్చేసింది. చివరగా మార్చిలో పద్మసంభవ విగ్రహాన్ని నేలకూల్చింది. 2021 డిసెంబర్ నుంచి ఇది మూడో ఘటన. బౌద్ధ మతాన్ని నాశనం చేయడంలో భాగంగా చైనాలో నిర్మించిన ఓ బౌద్ధ ఆరామాన్ని కూల్చేసిందని ఆయన తెలిపారు. తమ వారికి విషం పెట్టారని ఆరోపించారు. బుద్ధిజాన్ని నాశనం చేయడానికి చైనా ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేసిందని అన్నారు. బుద్ధ గయాలో మూడు రోజుల బోధనా కార్యక్రమాన్ని ఆయన చేపడుతున్నారు. ఇందులో చివరి రోజున మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

Also Read: బుద్ధగయాలో పర్యటిస్తున్న దలైలామా.. చైనా మహిళ కోసం పోలీసుల వేట.. ఆమెతో ముప్పు?

చైనా ప్రభుత్వం ఇన్ని ప్రయత్నాలు చేసినా బౌద్ధ మతం మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నదని స్పష్టం చేశారు. చైనాలోనూ బౌద్ధ మతాన్ని విశ్వసించే వారు చాలా మంది ఉన్నారని వివరించారు. మనుషులను గాయపరచి ఎవరి మతాన్ని అయినా ప్రమాదంలోకి నెట్టలేమని చెప్పారు. ఈ రోజు కూడా చైనాలో బౌద్ధాన్ని నమ్మేవారు బుద్ధుడికి ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు.

శనివారం ఉదయం దలైలామా కాలచక్ర గ్రౌండ్‌లో ప్రార్థనలు చేశారు. కరోనా మహమ్మారి నుంచి అణ్వాయుధాల నుంచి ప్రపంచాన్ని విముక్తం చేయాలని ఆయన  కోరారు. పీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 30 లక్షలు, బీహార్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 20 లక్షలను ఈ కార్యక్రమంలో ఆయన విరాళంగా ఇచ్చారు. దలైలామా పర్యటన నేపథ్యంలో పోలీసులు ఓ చైనా మహిళను గూఢచారిగా అనుమానించారు. ఓ ఊహాచిత్రాన్ని కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెను అనంతరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిసింది.

click me!