
Chandrayaan-3: అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చరిత్రను సృష్టించింది. ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 లో మిషన్ లోని ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలాన్ని తాకింది. దీంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ అవతరించింది. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది.
అయితే.. చంద్రయాన్-3కి చెందిన ప్రజ్ఞాన్ రోవర్ క్షిష్ట పరిస్థితిలో ఎన్నో అవరోధాలను అధిరోహిస్తూ జాబిల్లిపై తిరుగుతూ ముందుకు సాగుతోంది. చంద్రుడి అధ్యయనం కోసం ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తోంది. ఈ తరుణంలో ఓ పెను సవాలును ఎదుర్కోవడంలో విజయం సాధించింది. జాబిల్లిపై తిరుగుతూ అధ్యయనం చేస్తున్న రోవర్ ప్రజ్ఞాన్ ముందు చంద్రుని ఉపరితలంపై 100 mm బిలం (పిట్) గమనించారు. దీంతో శాస్త్రవేత్తలు అలర్ట్ అయ్యారు. దీంతో వెంటనే రోవర్ రూట్ మార్చారు. ఈసారి గొయ్యి చాలా పెద్దదిగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ ఇలాంటి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఇస్రో ట్విట్టర్ వేదికగా ఇలా పేర్కొంది. ‘ 2023, ఆగస్టు 27న రోవర్ ముందుకు వెళ్తున్న సమయంలో మూడు మీటర్ల దూరంలో క్రాటర్ (బిలం లేదా గొయ్యి) కనపడింది. ఈ గొయ్యి నాలుగు మీటర్ల వెడల్పు ఉంది. దీంతో రోవర్ దిశ మార్చుకునేలా కమాండ్ ఇచ్చాం. దీంతో దిశ మార్చుకున్న రోవర్ సురక్షితంగా ముందుకు సాగుతోంది ’ అని ఇస్రో పేర్కొంది. కాగా, చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ స్థిరంగా ఉంటుంది. ల్యాండర్ చూట్టూ రోవర్ తిరుగుతూ అక్కడి సమాచారాన్ని సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని ల్యాండర్ కు పంపుతుంది. ఆ ల్యాండర్ నుంచి ఇస్రోకు సమాచారం అందుతుంది. ఆ డేటాను శాస్త్రీయంగా విశ్లేషించారు ఇస్రో శాస్త్రవేత్తలు.