
చందమామ ఉపరితలంలోని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం విడుదల చేసింది. చంద్రయాన్ -3లోని విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 06.04 నిమిషాలకు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.
రాత్రి 10.00 గంటల తరువాత అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. అయితే అది 8 మీటర్ల వరకు తిరిగిందని, పేలోడ్స్ అన్ని సక్రమంగా పని చేస్తున్నాయని అంతకు ముందు ఇస్రో ప్రకటించింది. తాజాగా ప్రజ్ఞాన్ పని తీరుకు సంబంధించి కీలక అప్ డేట్ ను ఇస్రో అందజేసింది. రోవర్ కు సంబంధించిన వీడియోను విడుదల చేస్తూ.. ‘‘ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవం వద్ద చంద్ర రహస్యాలను అన్వేషించడానికి శివ శక్తి పాయింట్ చుట్టూ తిరుగుతుంది!’’ అని ఎక్స్ (ట్విట్టర్) అధికారిక పేజీలో పోస్టు చేసింది.
చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగే ప్రదేశాన్ని ఇకపై 'శివశక్తి' బిందువుగా పిలుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇది జరిగింది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటామని ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే చంద్రయాన్-2 క్రాష్ ల్యాండ్ అయిన ప్రాంతాని ‘త్రిరంగ’ అని పిలవాలని ఆయన నిర్ణయించారు.
దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటనను ముగించుకొని శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో ప్రధాన కార్యాలయం ఉన్న బెంగళూరుకు చేరుకున్నారు. చంద్రయాన్ -3 మిషన్ లో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఆగస్టు 23న చంద్రుడిపై భారత్ జెండా ఎగురవేసింది. ఇకపై ఆ రోజును భారతదేశంలో జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటాం’’ అని ప్రధాని మోడీ తెలిపారు.
చంద్రయాన్ 3 విజయంతో స్వదేశీ ఉత్పత్తికి ఊతం లభించిందని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు చంద్రుడిపైకి తీసుకెళ్లారని ఆయన అన్నారు. ఈ ప్రయోగం సమయంలో తాను దక్షిణాఫ్రికా, గ్రీస్ రెండు దేశాల పర్యటనలో ఉన్నానని, అయితే తన మనస్సు పూర్తిగా శాస్త్రవేత్తలతోనే ఉందని ప్రధాని తెలిపారు. వీలైనంత త్వరగా శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేయాలని భారత్ కు వచ్చానని అన్నారు.
కాగా.. ఇస్రో ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు స్థానికులు పోస్టర్లు, జాతీయ జెండాతో విమానాశ్రయం వెలుపల వీధుల్లో గుమిగూడారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో దిగిన ఆయన ఎయిర్ పోర్టు వెలుపల గుమిగూడిన ప్రజలను పలకరించి ‘జై విజ్ఞాన్ జై అనుసంధన్’ అని నినదించారు.