వ్యవసాయ చట్టాల్లో కేంద్రం సవరణలు: ఒప్పుకోబోమన్న రైతు సంఘాలు

By Siva KodatiFirst Published Dec 9, 2020, 2:47 PM IST
Highlights

నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనల్ని తాము ఎట్టిపరిస్ధితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు రైతు సంఘాల ప్రతినిధులు. బుధవారం మధ్యాహ్నం మరోసారి రైతు సంఘాలన్నీ భేటీ కానున్నాయి.

నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనల్ని తాము ఎట్టిపరిస్ధితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు రైతు సంఘాల ప్రతినిధులు. బుధవారం మధ్యాహ్నం మరోసారి రైతు సంఘాలన్నీ భేటీ కానున్నాయి.

ప్రభుత్వం పంపిన రాతపూర్వక ప్రతిపాదనలపై చర్చించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా తెలిపారు . ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే రేపు చర్చలు జరుపుతామన్నారు.

కేంద్ర వైఖరిని బట్టి ఆందోళనలను ముందుకు తీసుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కాగా, బుధవారం సాయంత్రం 4 లేదా 5 గంటల కల్లా రైతు సంఘాలు తమ నిర్ణయాల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   

మరోవైపు కొత్త చట్టాల్లో పలు సవరణలను అంగీకరిస్తూ కేంద్రం నేడు రైతు సంఘాలకు రాతపూర్వక ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా సవరణ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

ఏపీఎంసీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఏపీఎంసీల్లో ఒకే ట్యాక్స్ సవరణకూ సానుకూలంగా స్పందించింది. ప్రైవేటు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసేలా చట్టంలో మార్పులు చేస్తామని తెలిపింది.

ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా నిబంధనల్ని సవరిస్తామని పేర్కొంది. వ్యాపారులు-రైతుల ఒప్పంద వివాద పరిష్కారంలో ఎస్‌డీఎంల అధికారాల సవరణకు సైతం కేంద్రం సుముఖత తెలిపింది.  

ఒప్పంద వ్యవసాయంలో సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించేలా మార్పులు చేస్తామని ప్రతిపాదించింది. కనీస మద్దతు ధరపైనా రాతపూర్వక హమీకి ప్రభుత్వం అంగీకరించింది. పంట వ్యర్థాల దహనం అంశంపై పంజాబ్, హరియాణా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. 
 

click me!