
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్‌పై బిహార్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో తీవ్ర ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఇవి హింసాత్మకంగానూ మారాయి. పలుచోట్ల రైలు బోగీలకు నిప్పు పెట్టారు. బీజేపీ కార్యాలయాలపైనా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌పై క్లారిటీ ఇచ్చింది. అవి ఇలా ఉన్నాయి.
భవిష్యత్ భద్రం:
అగ్నిపథ్ స్కీం ద్వారా నియామకమైన అగ్నివీర్ల భవిష్యత్ సుస్థిరంగా ఉంటుందని స్పష్టం చేసింది. నాలుగేళ్లు అగ్నివీర్లు చేసిన తర్వాత వారి ఎంటర్‌ప్రెన్యూయర్లు కావాలనుకుంటే బ్యాంక్ లోన్ స్కీమ్, ఆర్థిక ప్యాకేజీ అందుతుందని వివరించింది. చదువు కొనసాగించాలనుకునే వారికి 12వ తరగతి సర్టిఫికేట్ ఇస్తామని, ఇతర కోర్సులకు బ్రిడ్జింగ్ కోర్సులూ ఏర్పాటు చేస్తామని తెలిపింది. జాబ్ చేయాలనుకునే వారికి కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు శాఖలో ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. ఇతర రంగాల్లోకి వెళ్లానుకునేవారికి అనేక వేదికలు సిద్ధం చేస్తామని తెలిపింది.
అగ్నిపథ్ కారణంగా యువతకు అవకాశాలు తగ్గుతాయా?
ఈ స్కీమ్ ద్వారా కేంద్ర బలగాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే యువతకు అవకాశాలు పెరుగుతాయి. వచ్చే సంవత్సరాల్లో అగ్నివీర్ల రిక్రూట్‌మెంట్ మూడు రెట్లు పెంచుతామని కేంద్రం తెలిపింది.
రెజిమెంటల్ సంబంధాలపై ప్రభావం?
రెజిమెంటల్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు, ఉత్తమమైన అగ్నివీర్లను ఎంపిక చేసి ఈ యూనిట్లను మరింత బలోపేతం చేస్తామని వివరించింది.
ఆర్మీ బలగాల సామర్థ్యం
అగ్నివీర్ల ద్వారా ఆర్మీ సామర్థ్యాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్రం తెలిపింది. ఇలాంటి విధానాలు ఇప్పటికే కొన్ని దేశాలు అనుసరిస్తున్నాయని వివరించింది. యూత్‌నే ఎక్కువగా ఆర్మీకి ప్రిఫర్ చేస్తున్నాయని తెలిపింది. అలాగే, ఆర్మీలో అనుభవజ్ఞుల సంఖ్యకు కూడా ఎలాంటి ముప్పు ఉండబోదని పేర్కొంది. అగ్నిపథ్ ద్వారా తొలి రిక్రూట్‌మెంట్ ద్వారా ఆర్మీలో కేవలం 3 శాతం మందినే నియమించుకుంటున్నామని తెలిపింది. అంతేకాదు, నాలుగేళ్ల తర్వాత అగ్నివీర్ల సామర్థ్యాలను పరిశీలించిన తర్వాతే ఆర్మీలోకి మళ్లీ తీసుకుంటామని వివరించింది. కాబట్టి, ఆర్మీలోకి అన్ని విధాల సుశిక్షితులైన, నైపుణ్యాలున్న, సమర్థులే చేరుతారని తెలిపింది.
అగ్నివీర్లతో సొసైటీకి ముప్పు?
చిన్న వయసులో ఆధునిక ఆయుధాల్లో శిక్షణ పొంది నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చి.. ఆర్థిక స్థితి బాగాలేక బలహీన స్థితిలో ఉగ్రవాద సంస్థల్లోకి వారు చేరే ముప్పు ఉంటుంది కదా? అనే ఆందోళనలు వచ్చాయి. దీనికి సమాధానంగా ఈ వ్యాఖ్యలు భారత భద్రతా బలగాల విలువలు, సాంప్రదాయాలను అవమానించినట్టేనని కేంద్రం పేర్కొంది. నాలుగేళ్లు ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నవారు జీవితాంతం దేశానికి కట్టుబడి ఉంటారని తెలిపింది. ఇప్పటికీ ఆర్మీ నుంచి రిటైర్ అయినవారు నైపుణ్యాలు ఉన్నప్పటికీ ఉగ్రవాదంలో చేరిన ఒక్క దాఖలా లేదని వివరించింది.
కాగా, గత రెండేళ్లుగా పదవుల్లో ఉన్న ఆర్మీ అధికారులతో చర్చలు, సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. మిలిటరీ శాఖ, మిలిటరీ సిబ్బందితోనే ఈ ప్రతిపాదన రూపొందించినట్టు పేర్కొంది. చాలా మంది మాజీ ఆర్మీ అధికారులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారని తెలిపింది.