కమలా హ్యారీస్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు.. అధ్యక్షురాలు కావాలంటూ పూజలు....

By AN TeluguFirst Published Jan 21, 2021, 9:19 AM IST
Highlights

తమిళనాడు లోని కమలా హ్యారీస్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. కమలా హ్యారీస్ తమ ఊరి అమ్మాయే అంటూ సంతోషం వెలిబుచ్చారు. ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె అమెరికా అధ్యక్షురాలు కావాలంటూ కోరిక వెలిబుచ్చారు. తమ గ్రామానికి చెందిన గోపాలన్‌ అయ్యర్‌ మనవరాలు అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలైందంటూ ఊరి ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు. 

తమిళనాడు లోని కమలా హ్యారీస్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. కమలా హ్యారీస్ తమ ఊరి అమ్మాయే అంటూ సంతోషం వెలిబుచ్చారు. ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె అమెరికా అధ్యక్షురాలు కావాలంటూ కోరిక వెలిబుచ్చారు. తమ గ్రామానికి చెందిన గోపాలన్‌ అయ్యర్‌ మనవరాలు అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలైందంటూ ఊరి ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు. 

ఆమె ఫోటోలు చేతబట్టి ర్యాలీగా మిఠాయిలు పంచుతూ, బాణసంచా కాల్చారు. ఊరి శివాలయంలో క్షీరాభిషేకం, అన్నదానం చేశారు.ఆమె అమెరికా అధ్యక్షురాలు కూడా కావాలంటూ ఆలయంలో అభిషేకం చేయించారు. తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా మన్నార్గుడి సమీపంలో తులసేంద్రపురం కమలా హ్యారిస్‌ పూర్వీకుల గ్రామం. 

ఆమె తాత(తల్లి తండ్రి) గోపాలన్‌ అయ్యర్‌, అమ్మమ్మ రాజం ఈ గ్రామానికి చెందినవారే. ఆంగ్లేయుల కాలంలో గోపాలన్‌ స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. 1930లో జాంబియా దేశం నుంచి వచ్చిన ప్రవాసులను లెక్కించేందుకు భారత ప్రభుత్వం ఆయనను అక్కడకు పంపింది. 
ఆయనకు శ్యామల, సరళ అనే ఇద్దరు కుమార్తెలుండగా, వారిలో శ్యామల కుమార్తే కమలాహ్యారిస్‌. 
1991లో తన తాత 80వ జన్మదినం సందర్భంగా కమల చెన్నైకి వచ్చి కొన్నాళ్లు కుటుంబసభ్యులతో గడిపారు. తమ ఊరి బిడ్డ అగ్రదేశానికి ఉపాధ్యక్షురాలు కావడం సంతోషంగా ఉందని కృష్ణమూర్తి అనే గ్రామస్థుడు వ్యాఖ్యానించారు. కమల తమ గ్రామానికి వస్తే తన స్వహస్తాలతో పిండివంటలు చేసి తినిపిస్తానని తంగమ్మాళ్‌ అనే మహిళ అన్నారు. కాగా, కమలాహ్యారిస్ తో తాను మాట్లాడానని ఆమె మేనమామ గోపాలన్‌ బాలచంద్రన్‌ తెలిపారు. 

‘‘నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని కొనసాగించు, ఇతరుల గురించి ఆలోచించకు.. మీ అమ్మ(ఉండుంటే) ఏం చెప్పేదో ఆలోచించు’’ అని సూచించినట్టు వివరించారు. తన సోదరి.. కమల తల్లి అయిన శ్యామల గురించి కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. 

చిన్నవయసులోనే పీహెచ్‌డీ పూర్తిచేసి తామందరం గర్వపడేలా ఆమె చేసిందని.. ఇప్పుడు ఆమె కుమార్తె కమల అగ్రరాజ్యానికి తొలి మహిళా వైస్‌ప్రెసిడెంట్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించి, తాము గర్వించేలా చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. 

‘‘నా కన్నా ముందు వచ్చిన మహిళల వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా’’ అంటూ.. ప్రమాణస్వీకారానికి ముందు కమలాహ్యారిస్‌ ట్విటర్‌లో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో తన తల్లి గురించి హృద్యంగా వివరించిన కమల.. హక్కుల కోసం పోరాడిన ఎందరో మహిళల గురించి ప్రస్తావించారు. ‘‘ఈరోజు నేనిక్కడ ఉండడానికి ప్రధాన కారణమైన మహిళ.. మా అమ్మ శ్యామల గోపాలన్‌ హ్యారిస్‌. ఆమె ఎప్పుడూ మా హృదయాల్లోనే ఉంటుంది’’ అన్నారు. 

అమెరికా చరిత్రలో వందేళ్లకు పైగా ఓటు హక్కు కోసం పోరాడిన మహిళల.. వందేళ్ల క్రితం రాజ్యాంగానికి 19వ సవరణ సాధించిన మహిళల.. 55 ఏళ్ల క్రితం ఓటింగ్‌ రైట్స్‌ యాక్ట్‌ను సాధించిన మహిళల.. ఇప్పుడు తమ హక్కుల కోసం ఓటేస్తున్న అందరు మహిళల భుజాలపై తాను నిలబడి ఉన్నానని కవితాత్మకంగా చెప్పారు. వారి కష్టాన్ని, దృఢసంకల్పాన్ని, వారి దార్శనికత తాలూకూ బలాన్ని తాను ప్రతిబింబిస్తానన్నారు. 

click me!