
భారతదేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హర్యానాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీనికారణంగా నదుల్లో ప్రవాహం పెరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం పంచకుల ప్రాంతంలోని షుగ్గుర్ నది పక్కన ఓ మహిళ కారు పార్క్ చేసి కూర్చుంది. అయితే భారీ వర్షం కారణంగా .. నదిలో ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. చూస్తుండగానే ఆ మహిళ కారుతో సహా వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ దృశ్యం చూస్తున్నవారంతా ఆమెను కాపాడాలని చూశారు.
ఈ క్రమంలో కారు ఓ మలుపు వద్ద బండరాళ్లపై ఇరుక్కుపోయింది. మహిళను కాపాడటానికి ఇదే మంచి సమయమని భావించిన స్థానికులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. తాడును స్తంభానికి కట్టి.. అలలు మధ్యనే తాళ్ల సాయంతో కారు దగ్గరికి చేరుకున్నారు. వారిలో సన్నగా వున్న ఓ యువకుడు వాహనంలోకి ప్రవేశించి ఆమెను బయటకు లాగారు. ఆపై క్షేమంగా ఒడ్డుకు చేర్చి ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా.. మహిళను స్థానికులు కాపాడిన దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ మహిళ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు వారి సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
ఇదిలావుండగా.. ఐఎండీ రోజువారీ బులెటిన్ ప్రకారం, నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. విదర్భ, చత్తీస్ గఢ్ లోని కొన్ని ప్రాంతాలు, వాయవ్య బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్ లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి. జూన్ 23 న జార్ఖండ్, బీహార్ లోని మరికొన్ని ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. వచ్చే రెండు రోజుల్లో ఛత్తీస్ గఢ్ లోని మరికొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్ లోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.