
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని విమానాశ్రయంలో ఓ ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి పాట్నాకు వెళ్లనున్న ఇండిగో విమానం రన్ వే పై పరుగులు పెట్టడానికి రెడీగా ఉన్నది. అదే సమయంలో అటు వైపుగా గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన కారు స్విఫ్ట్ డిజైర్ వెళ్లింది. అక్కడ ఇండిగో ఫ్లైట్ ఉన్నదనే విషయాన్ని పట్టించుకోకుండా ఆ కారు సరిగ్గా ఆ విమానం కిందకు వెళ్లింది. ఇండిగో ఫ్లైట్ ముందు చక్రానికి సమీపంగా ఆ కారు వెల్లింది. సరిగ్గా ఆ విమానం ముందు భాగంలో కిందకు వచ్చింది. ఆ తర్వాత ఆ కారు అక్కడే ఆగిపోయింది.
విమానం ముందు టైర్‌ను దాదాపు ఆ కారు ఢీకొట్టినంత పని చేసింది. కానీ, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేవని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వర్గాలు వివరించాయి. అలాగే, ఇండిగో విమానానికి కూడా ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపాయి. అయితే, ఆ డ్రైవర్ ఓవర్ వర్క్ చేయడం మూలంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని వివరించాయి.
వెంటనే ఆ కారు డ్రైవర్‌ను ఆపారు. ఆయనకు బ్రీథ్ అనలైజర్ టెస్టు చేశారు. ఇందులో ఆయన ఆల్కహాల్ తీసుకోలేదని తేలింది. ఈ ఘటన కెమెరాలో రికార్డ్ అయింది.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని టీ2 టర్మినల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
కాగా, ఆ ఇండిగో ఫ్లైట్ షెడ్యూల్ ప్రకారమే పాట్నాకు బయల్దేరి వెళ్లిపోయింది.