భారత సైన్యంపై పాక్ కాల్పులు: బీఎస్ఎఫ్ ఎస్ఐ మృతి

By Siva KodatiFirst Published Nov 13, 2020, 4:07 PM IST
Highlights

పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే వుంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంబడి శుక్రవారం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ ఎస్ఐ రాకేశ్ ధోవల్ ప్రాణాలు కోల్పోయారు. 

పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే వుంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంబడి శుక్రవారం కాల్పులకు తెగబడింది.

ఈ ఘటనలో బీఎస్ఎఫ్ ఎస్ఐ రాకేశ్ ధోవల్ ప్రాణాలు కోల్పోయారు. కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టార్‌ వద్ద బీఎస్ఎఫ్ ఆర్టిలరీ బ్యాటరీ వద్ద రాకేశ్ తన సిబ్బందితో మోహరించారు. 

శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో పాక్ బలగాలు భారత సైన్యంపై కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో రాకేశ్ తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన అమరుడైనట్లు బీఎస్ఎఫ్ తెలిపింది.

రాకేశ్ ధోవల్ స్వస్థల ఉత్తరాఖండ్ రాష్ట్రంల రిషికేశ్‌లోని గంగా నగర్. మరోవైపు పాక్ వైపు నుంచి ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని ఓ అధికారి వెల్లడించారు.

ఉత్తర కాశ్మీర్‌లోని బందిపొర జిల్లాలోని గురేజ్ సెక్టర్‌, ఇజ్‌మార్గ్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు జరిగినట్లు సమాచారం.

ఈ సంఘటన జరిగిన కొద్ది క్షణాలకే కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టర్‌లోనూ, బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టర్‌లోనూ పాకిస్థాన్ దళాలు కాల్పులకు  తెగబడినట్లు తెలుస్తోంది.

కేరన్ సెక్టర్‌లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తించి, చొరబాట్లను నిరోధించినట్లు చెప్పారు. పాకిస్థాన్ దళాలు కేరన్ సెక్టర్‌లో మోర్టార్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసినట్లు తెలిపారు.

పాకిస్థాన్ దళాల దుశ్చర్యలను భారతీయ దళాలు దీటుగా తిప్పికొట్టినట్లు తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు జరగడం ఈ వారంలో ఇది రెండోసారి అని పేర్కొన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో జరిగిన చొరబాటు యత్నాలను తిప్పికొట్టి, ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. 

click me!