
బీహార్ లోని ససారం టౌన్ లో శనివారం సాయంత్రం బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ పేలుడుపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఫొరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంపై ససారం డీఎం ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రోహ్తాస్ లోని ఓ గుడిసెలో బాంబు పేలినట్టు తమకు సమాచారం అందిందని, వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ ఎస్ ఎల్) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిందని అన్నారు.
స్వలింగ పెళ్లిళ్లు సమ్మతం కాదు.. భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకం : జమియత్ ఉలమా-ఐ హింద్
ఘటనా స్థలం నుంచి ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇది మతపరమైన సంఘటనగా కనిపించడం లేదని ప్రాథమికంగా తెలుస్తోందని చెప్పారు. క్షతగాత్రులను బీహెచ్ యూ హాస్పిటల్ కు తరలించామని పేర్కొన్నారు. దీనిని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదం అనంతరం పోలీసు బృందం, స్పెషల్ టాస్క్ ఫోర్స్ , పారా మిలటరీ బలగాలు శనివారం ససారంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి.
కాగా.. బీహార్ లో శనివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో మతపరమైన ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ముగ్గురికి బుల్లెట్ గాయాలు అయ్యాయని ‘ఎన్డీటీవీ’ నివేదించింది. బిహార్ షరీఫ్ లోని పహర్ పూర్ ప్రాంతంలో, సోహసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాస్ గంజ్ ప్రాంతంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. పహర్ పూర్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయని, వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని బీహార్ షరీఫ్ సదర్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ మహేంద్ర కుమార్ తెలిపారు.
జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం.. శరద్ పవార్, నితిన్ గడ్కరీల కీలక భేటీ..
వాస్తవానికి ఈ ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో మార్చి 31న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించాల్సి ఉంది. అయితే ఈ అల్లర్ల వల్ల ఆయా ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో ఆయన పర్యటన రద్దయ్యింది. అయితే బీహార్ లోని కొన్ని ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 45 మందిని అరెస్టు చేసినట్లు బీహార్ పోలీసులు తెలిపారు. ఇందులో ససారంలో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వారు 18 మంది ఉన్నారు. కాగా.. ఈ ప్రాంతంలో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, వదంతులను పట్టించుకోవద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ 144 సెక్షన్ విధించినట్లు వారు తెలిపారు.