కేంద్రంలో బీజేపీకి మరో ఆరు నెలలే.. భవిష్యత్ ఏమిటో ఆ పార్టీకి తెలిసిపోయింది: మమతా బెనర్జీ

By Mahesh KFirst Published Jun 27, 2023, 9:41 PM IST
Highlights

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీకి తమ ఓటమి భయం ఇప్పుడే పట్టుకుందని, వారి భవిష్యత్ వారికి తెలిసిపోయిందని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు. కాబట్టి, బీఎస్ఎఫ్ సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి భవిష్యత్‌లో తమ పరిస్థితి ఏమిటో ఇప్పటికే అర్థమైపోయిందని అన్నారు. కేంద్రంలో మరో ఆరు నెలలు మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంటుందని వివరించారు. అలాగే, సార్వత్రిక ఎన్నికలు జరిగే కాలాన్నీ ఆమె అంచనా వేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో స్థానిక పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ తలమునకలయ్యారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఆమె జల్‌పైగురిలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఇక్కడ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అలాగే.. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పైనా కామెంట్లు చేశారు.

బీజేపీ సూచనల మేరకు కొందరు బీఎస్ఎఫ్ సిబ్బంది సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆమె ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ మరో ఆరు నెలలు మాత్రమే ఉంటుందని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవుతుందని అన్నారు.

Also Read: Congress Strategy: తెలంగాణ లో కర్ణాటక ఫార్ములా.. హై కమాండ్ సూచించిన ఐదు ముఖ్యమైన పాయింట్లు ఇవే

ఇటీవలే ఆమె సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్.. బీజేపీ సూచనల మేరకు బెదిరింపులకు పాల్పడుతున్నదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బీఎస్ఎఫ్ కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి మమతా బెనర్జీ ఈ రోజు వాటిని గుర్తు చేశారు. తాను బీఎస్ఎఫ్ అధికారులందరిపై ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. కానీ, కొందరు మాత్రం తప్పుడు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. బీఎస్ఎఫ్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మరికొన్ని నెలల్లో బీజేపీ అధికారంలో ఉండకపోవచ్చని వివరించారు.

వచ్చే నెల 8వ తేదీన పశ్చిమ బెంగాల్‌లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇందుకోసమే ఆమె ప్రచారంలో పాల్గొన్నారు.

click me!