బీజేపీ యూటర్న్.. జన్ ఆక్రోశ్ యాత్ర కొనసాగుతుంది: రాజస్తాన్ బీజేపీ స్పష్టీకరణ

By Mahesh KFirst Published Dec 23, 2022, 1:31 PM IST
Highlights

రాజస్తాన్‌లో జన్ ఆక్రోశ్ యాత్ర నిలిపేస్తామని నిన్న సాయంత్రం చేసిన ప్రకటనపై బీజేపీ యూటర్న్ తీసుకుంది. ఈ విషయాన్ని రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ యాత్ర కొనసాగిస్తామని వివరించారు.
 

జైపూర్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్తాన్‌లో జన్ ఆక్రోశ్ యాత్రను నిలిపేస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. గంటల వ్యవధిలోనే ఈ ప్రకటనపై బీజేపీ యూటర్న్ తీసుకుంది. ఈ యాత్రను కొనసాగిస్తామని తాజాగా వెల్లడించింది. కొవిడ్ 19 ప్రొటోకాల్ పాటిస్తూ పబ్లిక్ మీటింగులు ఆర్గనైజ్ చేస్తామని పేర్కొంది.

జన్ ఆక్రోశ్ యాత్ర గురించి కొంత కన్ఫ్యూజన్ ఏర్పడిందని రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా అన్నారు. ఇప్పుడు ఆ గందరగోళం తొలగిపోయిందని వివరించారు. జన్ ఆక్రోశ్ యాత్ర ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు.

వచ్చే ఏడాది రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డిసెంబర్ 1వ తేదీన జన్ ఆక్రోశ్ యాత్రను ప్రారంభించారు. రైతులు, పరిపాలనా అంశాలను ప్రధానంగా చేసుకుని ఈ యాత్రలో ప్రభుత్వంపై బీజేపీ నేతల ప్రశ్నలు సంధిస్తున్నారు.

చైనాలో కరోనా కలకలం రేగడం, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో రాజస్తాన్‌లో జన్ ఆక్రోశ్ యాత్రను నిలిపేస్తున్నామని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్ న్యూ ఢిల్లీలో వెల్లడించారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంల బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. బీజేపీకి రాజకీయాల కంటే ప్రజల ప్రయోజనాల ముఖ్యమని వివరించారు. ప్రజల సేఫ్టీ, వారి ఆరోగ్యం తమ పార్టీకి ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు.

కొన్ని గంటల తర్వాతే రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా ఓ వీడియో స్టేట్‌మెంట్‌లో తాజా ప్రకటన చేశారు. జన్ ఆక్రోశ్ యాత్ర నిలిపేయడంపై కొంత గందరగోళం రేగిందని, ఇప్పుడదని స్పష్టమైందని వివరించారు. పబ్లిక్ మీటింగ్స్ కొనసాగుతాయని, కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన మార్గదర్శకాలు లేదా.. భవిష్యత్‌లో విడుదల చేసే మార్గదర్శకాలను పాటిస్తూ యాత్ర చేపడుతామని వివరించారు. ఇప్పటి వరకు 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర చేపట్టటినట్టు చెప్పారు.

రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ చేపడుతున్న భారత్ జోడో యాత్ర కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ కొనసాగిస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

click me!