
BJP slams Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శనాస్త్రాలను సంధించింది. గతంలో భారత్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వ్యక్తితో రాహుల్ గాంధీ సమావేశమవడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం ప్రారంభమైంది. రాహుల్ గాంధీ తన లండన్ పర్యటనలో భాగంగా బ్రిటిష్ ఎంపీ జెరెమీ కార్బిన్‌తో సమావేశమయ్యారు. కార్బిన్‌తో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీపై బీజేపీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింది. దీనిపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
భారతదేశం నుండి కాశ్మీర్ ను విడదీయాలని బ్రిటీష్ ఎంపీ కార్బిన్ అనేక వివాదాస్పద ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.. అలాంటి వివాస్పద వ్యాఖ్యలు చేసిన బ్రిటిష్ నాయకుడిని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కలిశారని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు, బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియాలు .. కార్బిన్-రాహుల్ గాంధీ భేటీకి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ సందర్భంలో కేంద్ర మంత్రి రిజిజు ట్వీట్ చేస్తూ.. “భారత్ పట్ల ద్వేషం, అయిష్టతకు పేరుగాంచిన బ్రిటిష్ ఎంపీ, లేబర్ నాయకుడు జెరెమీ కార్బిన్‌ను రాహుల్ గాంధీ కలిశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ.. ఒక వ్యక్తి తన సొంత దేశానికి వ్యతిరేకంగా ఎంతకాలం, ఎంత వరకు వెళ్లగలడు? అని ప్రశ్నించారు.
మరోవైపు..ఈ విషయంపై అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ.. బ్రిటిష్ ఎంపీ, లేబర్ నాయకుడు జెరెమీ కార్బిన్ కు భారతదేశం పట్ల అపరిమితమైన ద్వేషం ఉందని, కాశ్మీర్ వేర్పాటును సమర్ధించేవాడనీ, ఆయన హిందూ వ్యతిరేకి అని అన్నారు. మొత్తం మీద రాహుల్ గాంధీకి సరైన సహచరుడు, విదేశీ భాగస్వామి దొరికాడనీ, తనలాగే భారతదేశాన్ని బహిరంగంగా పరువు తీస్తున్నాడని ట్వీట్ చేశారు.
జెరెమి కార్బిన్‌తో రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ.. ఆయనతో పాటు ఉన్న రాహుల్ గాంధీ ఫోటోను బీజేపీ నేత కపిల్ మిశ్రా ట్వీట్ చేశారు. "రాహుల్ గాంధీ లండన్‌లో జెరెమి కార్బిన్‌తో ఏం చేస్తున్నారు..? జెరెమీ కార్బిన్ భారత్, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి అపఖ్యాతి పాలయ్యారు. జెరెమి కార్బిన్ కశ్మీర్‌ను భారత్‌ను విడదీయాలని బహిరంగంగా చెప్పారు." అని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ఎదురుదాడి
మరోవైపు, కార్బిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. భారతదేశంపై కార్బిన్ అభిప్రాయాలకు ప్రధాని మోదీ కూడా మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా భారతదేశ నాయకులు వివిధ అభిప్రాయాలు కలిగిన విదేశీ నేతలను గతంలో కలుస్తున్నారని, భవిష్యత్తులో కూడా వారిని కలుస్తారని చెప్పారు.
సుర్జేవాలా ట్వీట్ చేస్తూ.. మోదీ మరియు కార్బిన్‌లను కలిసిన చిత్రాన్ని పంచుకుంటూ, 'ఈ చిత్రంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించమని మీడియాలోని నా స్నేహితులను అడగాలనుకుంటున్నాను. మీరు వారిని అదే ప్రశ్న అడగగలరా? ఈ భేటీ అంటే భారత్‌పై కార్బిన్ అభిప్రాయాలను ప్రధాని సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు.
గతంలో నాయకులు ఇతర నేతలను కలుస్తూనే ఉన్నారని, వారితో సరితూగని వారితో కూడా కలుస్తూనే ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అన్నారు. మన అభిప్రాయానికి భిన్నంగా ఉన్న వ్యక్తితో రాహుల్ గాంధీ ఫోటో దిగడం నేరమా? లేదా ఉగ్రవాద చర్యనా? అని ప్రశ్నించారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించు కున్నప్పుడు ప్రధాని జీ జిన్‌పింగ్‌ను ఎందుకు కలిశారు?' అలాగే.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ప్రధాని మోదీ ఎందుకు కలిశారని సూర్జేవాలా ప్రశ్నించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ UK పర్యటనలో ఉన్నారు, ఆయన సోమవారం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జరిగిన డైలాగ్ సెషన్‌లో పాల్గొన్నారు.