
రాజస్తాన్ జోధ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని వారి బంధువే అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనతో రాజస్తాన్‌లోని శాంతి భద్రతలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా రాజస్థాన్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. రాజస్తాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దివ్య మాడెర్నా.. తాను సురక్షితంగా లేనని, తన కాన్వాయ్‌పై దాడి జరిగిందని చెబుతున్న వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.
‘‘నేను ఇక్కడ సురక్షితంగా లేను. నిందితులను ఇంకా అరెస్టు చేయలేదు. నేను పోలీసుల రక్షణలో ప్రయాణించినప్పటికీ నా కారుపై 20 చోట్ల దాడి జరిగింది. రెండు రోజుల క్రితం నాకు బెదిరింపు వచ్చింది. నా రక్షణ కోసం పలువురు పోలీసు సిబ్బందిని నియమించారు. సంఘటనా స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలో నా కారును ఆపి.. నాపై దాడి జరిగే అవకాశం ఉందని ఎస్పీకి చెప్పాను. అయితే తగిన ఏర్పాట్లు ఉన్నాయని ఎస్పీ హామీ ఇచ్చారు. అయినప్పటికీ నాపై దాడి జరిగింది’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే దివ్య మాడెర్నా చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది.
దీనిపై పీయూష్ గోయల్ స్పందిస్తూ.. ‘‘అవమానకరం!. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అటవీక పాలనలో సామాన్య మహిళలను వదిలేయండి.. సొంత పార్టీ మహిళా శాసనసభ్యులు కూడా సురక్షితంగా లేరు’’ అని విమర్శలు గుప్పించారు. మరోవైపు రాజస్తాన్ బీజేపీ కూడా ఈ పరిణామంపై స్పందించింది. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని కాంగ్రెస్ ఎమ్మెల్యే దివ్య మదర్నా బట్టబయలు చేశారు. ‘నేను సురక్షితంగా లేను’ అని ఆమె చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి.. కాంగ్రెస్ పాలనలో కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే భయపడుతున్నప్పుడు, ప్రజల పరిస్థితి ఏంటి?’’ అని ప్రశ్నించింది.
మరో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ స్పందిస్తూ.. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలపై మీ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు నిజాలు చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు!. మీరు ఏ ఆలోచనతో, అధికారంతో ముఖ్యమంత్రి, హోంమంత్రి అయ్యారో తెలియదా?. మీరు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది.శాంతిభద్రతల సమస్య పరిష్కారానికి మీ రాజీనామా తొలి అడుగు కావాలి’’ అని విమర్శలు గుప్పించారు.
కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ స్పందిస్తూ.. ‘‘ఎమ్మెల్యే దివ్య మాడెర్నా చోటుచేసుకున్న అనుభవం.. ఆమెకే కాదు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ఆడబిడ్డల బాధ. రాజస్థాన్‌లో కాంగ్రెస్ విస్తరించిన జంగిల్ రాజ్ ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. కానీ ముఖ్యమంత్రికి రాష్ట్రం గురించి బాధ లేదు.. తన కుర్చీ, గాంధీ కుటుంబం గురించి మాత్రమే వారి ఆలోచన’’ అని మండిపడ్డారు.
ఈ పరిణామాలపై బీజేపీ నేత లక్ష్మీకాంత్ భరద్వాజ్ నేరుగా రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘జోధ్‌పూర్‌లో ఓ కుటుంబాన్ని హత్య చేసి తగులబెట్టారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా.. తాను సురక్షితంగా లేనని, తనపై దాడి జరిగిందని చెప్పింది. రాహుల్ గాంధీ నువ్వు వింటున్నావా?’’ అని లక్ష్మీకాంత్ భరద్వాజ్ ప్రశ్నించారు.
అసలేం జరిగిందంటే..
జోధ్‌పూర్‌లో బుధవారం నాడు ఒకే కుటుంబంలోని నలుగురిని వారి బంధువు గొడ్డలితో నరికి, మృతదేహాలకు నిప్పంటించాడు. మృతుల్లో ఆరు నెలల చిన్నారి కూడా ఉంది. జిల్లాలోని ఓసియన్ ప్రాంతంలోని చెరియా గ్రామంలో పప్పురాం(19) అనే యువకుడు.. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు పొలాల్లో ఉన్న తన తండ్రి సోదరుడు పూనారాం(60) ఇంటికి చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో పూనారాం, అతని భార్య భన్వారీ (55), వారి కోడలు ధాపు (23)లను హత్య చేశాడు. ఆరు నెలల చిన్నారిని కూడా మంటల్లో విసిరేశాడు.
ఇక, నేరం జరిగిన ప్రాంతానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే అయిన దివ్య మాడెర్నా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘‘రాజస్థాన్‌లో శాంతిభద్రతలు తీవ్రంగా ఉన్నాయి. పోలీసులు అసమర్థంగా ఉన్నారు. ఒక గ్రామంలోని ప్రజలకు ఇంత ఘోరంగా ఏదైనా జరిగితే.. ఐజీని బాధ్యులుగా చేసి బర్తరఫ్ చేయాలి’’ అని అన్నారు.