ఆయన రెండు నేరాలు చేశారు: నెహ్రూపై శివరాజ్‌సింగ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 11, 2019, 10:28 AM IST
Highlights

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ ఓ క్రిమినల్ అని.. కాశ్మీర్‌కు జరిగిన అన్యాయానికి కారణం ఆయనేనని శివరాజ్ ధ్వజమెత్తారు

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ ఓ క్రిమినల్ అని.. కాశ్మీర్‌కు జరిగిన అన్యాయానికి కారణం ఆయనేనని శివరాజ్ ధ్వజమెత్తారు.

పండిట్ తప్పుడు నిర్ణయాలు తీసుకుని వుండకపోయి వుంటే కాశ్మీర్ పూర్తిగా భారత్ సొంతమయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత సైన్యం కాశ్మీర్ నుంచి పాక్ గిరిజనులను వెళ్లగొడుతున్న సమయంలో నెహ్రూ కాల్పుల విరమణను ప్రకటించి.. తొలి నేరానికి పాల్పడ్డారని.. అందువల్ల 1/3 వంతు భూభాగం పాక్ చేతిలోకి వెళ్లిందని చౌహాన్ గుర్తు చేశారు.

నెహ్రూ కనుక కొద్దిరోజులు మౌనంగా ఉండి..కాల్పుల విరమణ ప్రకటించి వుండకపోతే కాశ్మీర్ భారత్ ఆధీనంలోనే ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తీసుకువచ్చి నెహ్రూ రెండో నేరం చేశారని ఆరోపించారు.

అందువల్ల ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండాల్సిన పరిస్ధితి నెలకొందని.. ఇది దేశానికి చేసిన అన్యాయమే కాదని నేరం కూడా అని పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని మోడీ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు కాశ్మీర్‌ పునర్విభజన బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 

click me!