రాజ‌స్థాన్ బ‌డ్జెట్ ను ముదురు చ‌ర్మం గ‌ల‌ వ‌ధువుతో పోల్చిన బీజేపీ అధ్య‌క్షుడు.. క్ష‌మాప‌ణ కోరిన కాంగ్రెస్

Published : Feb 24, 2022, 02:46 AM IST
రాజ‌స్థాన్ బ‌డ్జెట్ ను ముదురు చ‌ర్మం గ‌ల‌ వ‌ధువుతో పోల్చిన బీజేపీ అధ్య‌క్షుడు.. క్ష‌మాప‌ణ కోరిన కాంగ్రెస్

సారాంశం

రాజస్థాన్ రాష్ట్ర బడ్జెట్ పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్సదంగా మారాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బ‌డ్జెట్ ను ముదురు చర్మం గల వదువుతో ఆయన పోల్చారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. 

అసెంబ్లీలో లేదా పార్ల‌మెంట్ లో అధికార ప‌క్షం వార్షిక బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెడుతుంటాయి. ఇందులో వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన వ్య‌య‌, రాబ‌డులు అన్నీ అంచ‌నా వేస్తారు. ఆ ఏడాదిలో ఆయా రంగాల‌కు కేటాయించాల‌నుకున్న నిధులు, కొత్త‌గా ఏర్పాటు చేయ‌బోయే ప్రాజెక్టులు ఇలా ఆయా ప్ర‌భుత్వాల ల‌క్ష్యాల‌ను ఆ బ‌డ్జెట్ లో పొందుప‌రుస్తారు. అయితే ఈ బ‌డ్జెట్ పై ప్ర‌తిపక్షాలు, ఇత‌ర నాయ‌కులు విమ‌ర్శ‌లు చేయ‌డం స‌హ‌జం. అయితే రాజ‌స్థాన్ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ విష‌యంలో వివాదం నెల‌కొంది. 

రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ అధికార పార్టీగా ఉంది. అయితే బుధ‌వారం ఆ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టింది. అయితే దీనిని ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు స‌తీష్ పూనియా మంచి మేక్ఓవర్ పొందిన తర్వాత ముదురు రంగులో ఉన్న వధువు ముఖంతో పొల్చారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వివాదంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఆయ‌న‌పై నిప్పులు చెరిగింది. 

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం అసెంబ్లీలో బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత రాజస్థాన్ బీజేపీ అధ్య‌క్షుడు సతీష్ పూనియా విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ‘‘ ఇది 'డాబ్-అప్' బడ్జెట్‌గా అనిపిస్తోంది, నల్లగా ఉన్న వధువును బ్యూటీ పార్లర్‌కు తీసుకెళ్లి మేకప్ వేసి రెడీ చేసిన తరువాత సమర్పించినట్లు కనిపిస్తోంది.’’ అని ఆయ‌న అన్నారు.  ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్ర బీజేపీ చీఫ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. 

‘‘ సతీష్ పూనియా జీ మహిళలను అవమానించడమే కాకుండా, అటువంటి అసభ్యకరమైన, బాధ్యతారహితమైన వ్యాఖ్యలతో మహిళల గౌరవాన్ని కూడా దెబ్బతీశాడు. మహిళలు, సోదరీమణులు కుమార్తెలను కించపరిచే పదాలు ఉపయోగించడం బీజేపీ నాయకుల లక్షణం ’’ అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా అన్నారు. 

అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ఈ వ్యాఖ్య‌ల‌ను అవ‌మాన‌క‌రం అని అన్నారు.‘‘ ఇది చాలా దారుణమైన వ్యాఖ్య. మహిళలను అవమానించడమే కాదు అంటరానితనం  వర్ణవివక్షతో కంపు కొట్టే రాజ్యాంగ వ్యతిరేక ప్రకటన ’’ అని మహిళా కాంగ్రెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. పూనియా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది.

గెహ్లాట్‌కు స్పెషల్ డ్యూటీ అధికారి (OSD) లోకేశ్ శర్మ కూడా సతీష్ పూనియా వ్యాఖ్యలను వ్యాఖ్యలను ఖండించారు. ‘‘ మహిళలను గౌరవించడం చాలా ముఖ్యం. బడ్జెట్‌ను విమర్శిస్తూ సతీష్ పూనియా జీ మహిళలపై ఇలాంటి జాత్యహంకార వ్యాఖ్య చేయడం సరికాదు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ’’ అని ఆయ‌న ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu