పార్లమెంటులో లిక్కర్ బాటిల్‌తో బీజేపీ ఎంపీ.. ఆయన ఏం చెప్పారంటే..?

By Pratap Reddy KasulaFirst Published Dec 6, 2021, 10:28 PM IST
Highlights

బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఈ రోజు పార్లమెంటులోకి లిక్కర్ బాటిల్ తీసుకెళ్లారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ ఆయన ఈ పని చేశారు. ఒకవైపు కరోనాతో ప్రజలు చనిపోతుంటే ఆయన మద్యం అమ్మకాలు జరిపి రెవెన్యూ ఎలా పెంచుకోవాలా? అనే ఎక్సైజ్ పాలసీ రూపొందించడంలో మునిగిపోయారని ఆరోపించారు. ఢిల్లీలో మద్యం అమ్మకాలు పెరగడానికి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
 

న్యూఢిల్లీ: ఓ బీజేపీ ఎంపీ(BJP MP) ఈ రోజు Parliamentలో లిక్కర్ బాటిల్‌(Liquor Bottle)తో కనిపించారు. సమావేశం జరుగుతుండగా ఆయన లేచి నిలబడి ఓ లిక్కర్ బాటిల్, ఓ గ్లాసును చూపించారు. అయితే, తొలుత కొంత ఆశ్చర్యం, విస్మయకర చూపులు అటువైపు పడినా.. ఆయన మాట్లాడటం మొదలు పెట్టాక అందరూ యథాస్థితికి వచ్చారు. పార్లమెంటులో లిక్కర్‌తో ఢిల్లీ ప్రభుత్వాన్ని కడిగేశారు. కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రభుత్వం లిక్కర్‌ అమ్మకాలను భారీగా ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. ఒక వైపు ప్రజలు కరోనా మరణిస్తుంటే ఢిల్లీ ప్రభుత్వం మద్యం ఎలా అమ్మాలా? అని ఎక్సైజ్ పాలసీ రూపొందించడంలో మునిగిపోయిందని బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ అన్నారు.

‘కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు సుమారు 25వేల మంది ఢిల్లీలో మరణించారు. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో మద్యం విక్రయాలు ఎలా పెంచాలా? అనే లక్ష్యంతో ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో మునిగిపోయింది’ అని బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విమర్శలు చేశారు. ఈ రోజు 824 లిక్కర్ షాప్‌లు తెరిచారని ఆయన అన్నారు. నివాసాలు, కాలనీ, గ్రామాలు, అననుకూల ప్రాంతాల్లోనూ లిక్కర్ షాపులు తెరుస్తున్నారని వివరించారు. అంతేకాదు, కొన్ని లిక్కర్ షాపులకు నియమ నిబంధనలేవీ ఉండటం లేదని ఆరోపించారు. కొన్ని లిక్కర్ షాపులు తెల్లవారు జాము 3 గంటల వరకు తెరిచే ఉంటున్నాయని వివరించారు. అంతేకాదు, ఉదయం 3 గంటల దాకా లిక్కర్ తాగుతూ కూర్చుంటే వారికి లిక్కర్ షాపు వారు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారని తెలిపారు. మద్యం తాగే వారి వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించారని చెప్పారు.

Also Read: ఆటో డ్రైవర్ నుంచి డిన్నర్ ఇన్విటేషన్.. వెంటనే అంగీకరించిన సీఎం..

ఈ నిర్ణయాల వెనుక లక్ష్యం ఏమిటో అందరికీ సులువుగానే స్పష్టంగా అర్థం అవుతున్నదని బీజేపీ ఎంపీ వర్మ అన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేవలం రెవెన్యూ పెంచుకోవాలని చూస్తున్నారని తెలిపారు. తద్వారా ప్రభుత్వ ఖజానాతో ఆయన క్యాంపెయిన్ చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. ఆయన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన పంజాబ్‌లో క్యాంపెయిన్ చేయడానికి వెళ్లి ఢిల్లీలో అమలు చేసే విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పంజాబ్‌లో మద్యం సేవించే సంస్కృతికి స్వస్తి పలుకుతానని చెప్పారు. కానీ, అదే అరవింద్ కేజ్రీవాల్  ఢిల్లీలో మద్యం ఏరులై పారడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ ప్రకారం అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రైవేటు లిక్కర్ షాపులను మూసేయాలి. అయినప్పటికీ కొన్ని షాపులు తెరిచే ఉంటున్నాయని తెలుస్తున్నది.

వచ్చే ఏడాది తొలినాళ్లలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కన్ను వేశారు. ఇటీవల ఆయన పంజాబ్ పర్యటనలు పెరుగుతున్నాయి పంజాబ్ వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక సమూహంతో సమావేశాలు జరుపుతున్నారు. కొన్ని పథకాలను ప్రకటిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని చెబుతున్నారు. సాగు చట్టాలపై రైతుల ధర్నా నేపథ్యంలో పంజాబ్ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి.

click me!