
కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. మరి కొద్దీ గంటల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, జేడిఎస్ పార్టీల నేతలు విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ.. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. తమ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రధాన పార్టీల అగ్రనేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రచారం మరింత జోరుగా సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు, బహిరంగ సభలు ఈ ఎన్నికలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. కాంగ్రెస్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ తరుఫున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లిఖర్జున్ ఖర్గే లతో పాటు ఇతర సీనియర్ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ తరుణంలో అన్ని పార్టీల నేతలు ఘాటైన ప్రకటనలు చేస్తున్నాయి. పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీని బీజేపీ టార్గెట్ చేసింది. సోనియా గాంధీ తన ప్రసంగంలో కర్నాటక సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి బిజెపి ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు లేఖను సమర్పించింది. సోనియాజీ వ్యాఖ్యాలపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం కోసం తాము కట్టుబడి ఉన్నామని, ఎన్నికల కమిషన్‌లో నమోదు కోసం పార్టీ అఫిడవిట్ ఇస్తుందని, సోనియా గాంధీ తన సంచలన ప్రకటనతో ఆ నిబంధనను ఉల్లంఘించిందని బీజేపీ పేర్కొంది.
కరప్షన్ రేట్ కార్డుతో కూడిన ప్రకటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదని, కాబట్టి బీజేపీకి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందని బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల సంఘానికి తెలిపింది. మే 7 సాయంత్రం 5 గంటలలోపు కమిషన్ నోటీసుకు కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సి ఉందని బీజేపీ బృందం చెబుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ విషయమై ఢిల్లీలోని బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కలిసింది.
అసలు విషయం ఏమిటి?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మే 6న సోనియా గాంధీ కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేశారు. ఈ క్రమంలో సోనియా మాట్లాడుతూ.. బిజెపిపై విమర్శలు గుప్పించారు. కర్ణాటక ప్రతిష్టకు, సార్వభౌమాధికారానికి లేదా సమగ్రతకు ముప్పు కలిగించడానికి కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదని చెప్పారు. ఈ ప్రకటనతో బీజేపీ సోనియా గాంధీపై విరుచుకుపడుతోంది. కర్ణాటక సార్వభౌమాధికారం అనే పదానికి సంబంధించి, హుబ్లీలో సోనియా గాంధీ చేసిన ప్రసంగంలో కర్ణాటక సార్వభౌమాధికారం గురించి మాట్లాడారని, సార్వభౌమాధికారం అనే పదం దేశాన్ని మాత్రమే సూచిస్తుందని బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే ఆరోపించారు. అందుకే సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.