
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకోవడం వెనక క్రాస్ ఓటింగ్ జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు శివసేన సీనియర్ నేత, మహా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండ్.. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో గుజరాత్‌లో మకాం వేశారు. కొంతకాలంగా ప్రభుత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను తమవైపు తెచ్చుకునేందుకు ఏక్‌నాథ్ షిండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన బీజేపీ సీనియర్ నేతలతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతుంది. మరోవైపు ఏక్‌నాథ్ షిండే బాటలో నడుస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతుందని పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి.
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం, అసెంబ్లీలో బీజేపీ పక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఫడ్నవీస్ నేడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశం కానున్నారు. దీంతో తెరపైకి సరికొత్త చర్చ వచ్చింది. మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వంపై తిరుగుబావుట ఎగరవేసిన ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశలు ఉన్నాయనే ప్రచారం సాగుతుంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం వ్యుహా రచన చేస్తుందని.. ఫడ్నవీస్‌కు ఇందుకు సంబంధించి దిశానిర్దేశనం చేసే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే Shivendraraje Bhosale చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మహారాష్ట్రలో త్వరలో ఫడ్నవీస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుందని శివేంద్రరాజే అన్నారు.
మరోవైపు పలువురు ఎమ్మెల్యేలతో గుజరాత్‌లో క్యాంప్ వేసిన ఏక్‌నాథ్ షిండే మరికొద్ది గంటల్లో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేను ఏక్‌నాథ్ షిండే కోరే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే ఏక్‌నాథ్ షిండే నిర్వహించే మీడియా సమావేశం వరకు వేచిచూడాల్సిందే.
ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ షిండే ముంబైలో సంజయ్ రౌత్ కూడా ధ్రువీకరించారు. కానీ, వారిని తాము సంప్రదించగలిగామని వివరించారు. ఏక్‌నాథ్ షిండేను ఉపయోగించి తమ ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నాలు సఫలం కావని అన్నారు. షిండే తమ పార్టీకి విశ్వసనీయమైన నేత అని వివరించారు. తమతోపాటు చాలా ఆందోళనల్లో ఆయన పాలుపంచుకున్నారని వివరించారు. ఆయన బాలాసాహెబ్ సైనికుడు అని చెప్పారు. శివసేన పార్టీనే విశ్వసనీయుల పార్టీ అని అన్నారు. శివసేన నేతలు అధికార లాలసకు పడిపోరని చెప్పారు. అసలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే కన్ఫ్యూజన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. వారు తిరిగి రాకుండా బీజేపీ అడ్డుకుంటున్నదని అన్నారు. ఇది నిర్బంధం అని, బీజేపీ.. శివసేన ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. సోమవారం రాత్రి తమ ఎమ్మెల్యేలు కాంటాక్టులో లేరన్నది నిజమేనని, కానీ, ఇప్పుడు వారిలో చాలా మందిని తాము సంప్రదించగలిగామని వివరించారు.
ఇక, ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో బలబలాను పరిశీలిస్తే.. మొత్తం 288 స్థానాలున్న శాసనసభలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి 168 మంది సభ్యులు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 113 మంది సభ్యులు, ఇతరులు ఆరుగురు ఉన్నారు. ఒక్క స్థానం ఖాళీగా ఉంది.