Hijab Row: హిజాబ్ నిషేధంపై బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నదంటే?

Published : Feb 09, 2022, 06:06 PM IST
Hijab Row: హిజాబ్ నిషేధంపై బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నదంటే?

సారాంశం

బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ప్రభుత్వం హిజాబ్ వివాదంపై స్పందించింది. హిజాబ్ నిషేధించాలన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇప్పటికైతే తమ రాష్ట్రంలో ఈ వివాదం లేదని పేర్కొంది. అందుకే హిజాబ్‌ను నిషేధించే ఆలోచనల లేదని వివరించింది. దీనిపై ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని పేర్కొన్నారు. కర్ణాటకలో కూడా ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉన్నదని తెలిపారు.  

భోపాల్: కర్ణాటక(Karnataka)లోని ఉడిపి జిల్లాలో మొదలైన హిజాబ్ వివాదం(Hijab Row) రాష్ట్రాన్ని మొత్తం చుట్టేసింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హిజాబ్‌ వివాదంతో ఉద్రిక్తంగా మారుతున్నది. దేశవ్యాప్తంగా ఈ వివాదంపై చర్చ జరుగుతున్నది. హిజాబ్ ధరించవద్దని కొందరు.. అది మా హక్కు అని ఇంకొందరు వాదవివాదాలకు దిగుతున్నారు. ఈ వివాదం ముదరడంతో కర్ణాటక హైకోర్టుకు చేరింది. ఐదుగురు మహిళలు ఈ అంశాన్ని విచారించాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతున్నా.. కర్ణాటకలోని విద్యా సంస్థల్లో ఘర్షణలు ఆగలేదు. దీంతో సీఎం బసవరాజు బొమ్మై నిన్న రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు బంద్ ప్రకటించారు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో తాజాగా, బెంగళూరులోని అన్ని విద్యా సంస్థల ముందు ఆందోళనలనూ నిషేధిస్తూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే హిజాబ్ నిషేధించడంపై మధ్యప్రదేశ్(Madhya Pradesh) ప్రభుత్వం కూడా స్పందించింది.

మధ్యప్రదేశ్‌లో ఇప్పటికైతే హిజాబ్ ధరించడంపై వివాదం లేదని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వివరించారు. అందుకే ఈ హిజాబ్ ధారణను నిషేధించాలనే ప్రతిపాదనను తమ పరిగణనలో లేదని తెలిపారు. దీనిపై ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని పేర్కొన్నారు. కర్ణాటకలో కూడా ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉన్నదని తెలిపారు.

మధ్యప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ ఇటీవలే కర్ణాటకలో హిజాబ్ వివాదంపై స్పందించిన సంగతి తెలిసిందే. హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ఆయన సమర్థించారు. అంతేకాదు, హిజాబ్‌ను బ్యాన్ చేయాలని ఆయన వాదించారు. తాజాగా, ఆయన యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా వక్రీకరించారని పేర్కొన్నారు. తాము కొత్త యూనిఫామ్ కోడ్‌ను ప్రవేశపెట్టడం లేదని వివరించారు. ప్రస్తుతం పాఠశాలల్లో అమలు అవుతున్న యూనిఫామ్ విధానం ఇకపైనా కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే, అదే సమయంలో మరో హెచ్చరిక చేశారు. ఒక వేళ ఇక్కడ కూడా హిజాబ్ వివాదం తలెత్తితే దాన్ని బ్యాన్ చేస్తామని చెప్పారు. అందుకు తగినట్టుగా తాము చర్యలు తీసుకుంటామని అన్నారు.

హిజాబ్‌పై పాకిస్తాన్ విదేశాంగ  శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. హిజబ్ తమ సమస్య అని.. తామే పరిష్కరించుకుంటామని అసద్ కౌంటరిచ్చారు. బాలికల విద్యపై మీరు మాకు పాఠాలు చెప్పనక్కర్లేదన్నారు. మలాలాను పాకిస్తాన్‌లోనే ఎటాక్ చేశారని.. మహిళలకు హిజాబ్ రాజ్యాంగం కల్పించిన హక్కు అని అసదుద్దీన్ గుర్తుచేశారు. ఆ హక్కు కోసమే తాము పోరాటం చేస్తున్నామని.. హిజాబ్ కోసం పోరాడే వారికి తాము సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నట్లు ఒవైసీ పేర్కొన్నారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా కర్ణాటక సర్కార్ నోటిఫికేషన్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. 

అంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి మ‌హ్మ‌ద్ ఖురేషీ ట్విట్ట‌ర్ వేదిక‌గా హిజాబ్ వివాదంపై తీవ్రంగా స్పందించారు. హిజాబ్ ధ‌రించిన కార‌ణంగా మ‌హిళ‌ల‌ను విద్య నుంచి దూరం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, ఇది మాన‌వ‌హ‌క్కుల‌ను హ‌రించ‌డ‌మే అవుతుంద‌ని ఆయన ఖురేషీ వ్యాఖ్యానించారు. హిజాబ్ ధ‌రించిన వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌డం అంటే అణ‌చివేయ‌డ‌మేనని.. ఇలా చేయ‌డం ద్వారా ముస్లింల‌ను గుప్పిట్లో పెట్టుకోవాల‌ని భార‌త ప్ర‌భుత్వం చూస్తోందంటూ మ‌హ్మ‌ద్ ఖురేషీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అసదుద్దీన్ కౌంటరిచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?