
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళను తెలంగాణ బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతితో భేటీ అయినట్టుగా సమాచారం. ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన రహస్య సమావేశం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ భేటీ తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జయలలిత అంటే విజయశాంతికి ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించారు. శశికళతో కూడా ఆమెకు మంచి సంబంధాలే ఉన్నాయి. 2017లో జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ అల్లుడు TTV Dhinakaran తరఫున విజయశాంతి ప్రచారం నిర్వహించారు.
జయలలిత మరణం తర్వాత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లిన శశికళ.. ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. శశికళ జైలులో ఉన్న సమయంలో కూడా విజయశాంతి ఆమెను బెంగళూరులోని Parappana Agrahara Central Prisonకు వెళ్లి మరి పరామర్శించారు. శశికళ జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకు (ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో) విజయశాంతి చెన్నై వెళ్లి శశికళతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆమెను పరామర్శించి ఆరోగ్యంపై ఆరా తీశారు. అంటే శశికళతో విజయశాంతికి ఉన్న అనుబంధం అర్థం చేసుకోవచ్చు.
ఇక, తాజా భేటీ విషయానికి వస్తే.. కొంతకాలంగా శశికళ అన్నాడీఎంకేలో తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆధ్యాత్మిక యాత్ర పేరుతో రాష్ట్రంలోని వివిధ ఆలయాలను ఆమె సందర్శించారు. పలుచోట్ల తన మద్దతుదారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. తన మద్దతుదారుల ఇంట్లో జరుగుతున్న కార్యక్రమాలకు సైతం శశికళ హాజరవుతున్నారు. అన్నాడీఎంకేకు తాను నాయకత్వం వహించాలని చాలా మంది కార్యకర్తలు కోరుకుంటున్నారని శశికళ ఇటీవల కామెంట్ చేశారు. వారి కోరిక మేరకు మళ్లీ అన్నాడీఎంకేకు నాయకత్వం వహిస్తానని, జయలలిత కలను నెరవేరుస్తానని ఆమె తెలిపారు. తనను కొంతమంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
మరోవైపు రాష్ట్రంలో అధికారానికి దూరమైన అన్నాడీఎంకే.. తిరిగి పుంజుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందుకు అన్నాడీఎంకే నుంచి వెళ్లిపోయిన కీలక నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే శశికళతో విజయశాంతి భేటీ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ బేటీలో శశికళ తన భవిష్యత్ రాజకీయ ప్రయాణం గురించి విజయశాంతితో విస్తృతంగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
అయితే జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతుల్లో ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు చెప్పినట్టుగా అన్నాడీఎంకే నేతలు నడుచుకుంటారనే ప్రచారం ఉంది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టాలనే ఆలోచనలో ఉన్న శశికళ.. ఇందుకు ఢిల్లీ పెద్దల సహకారం కావాలని భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయశాంతి జరిగిన సమావేశంలో.. తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణం గురించి శశికళ చర్చించినట్టుగా తెలుస్తోంది.
(File Photos)