ఓట్లేసి మరీ... బిజెపి నేతకు యూత్ కాంగ్రెస్ పదవి

By Arun Kumar PFirst Published Dec 22, 2020, 4:14 PM IST
Highlights

కొన్ని నెలల క్రితమే పార్టీని వీడిన బిజెపిలో చేరిన నాయకుడొకరికి పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ.

భోపాల్: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. కొన్ని నెలల క్రితమే పార్టీని వీడిన బిజెపిలో చేరిన నాయకుడొకరికి పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇదేదో నామినేటెడ్ పదవి...ఒకరిద్దరి తప్పిదాల వల్ల ఇలా జరిగి వుంటుంది అనుకోడానికి కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఓట్ల ద్వారా బిజెపి నాయకుడికి ఇలా పదవి వరించింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా మారిందో తెలియజేయడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. 

మధ్య ప్రదేశ్ లో తొమ్మిదినెలల కింద సీనియర్ కాంగ్రెస్ నాయకులు జ్యోతిరాధిత్య సింథియా బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. కేవలం ఆయన ఒక్కరే కాదు తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులతో బిజెపిలో చేరారు. ఈ క్రమంలోనే హ‌ర్షిత్ సింఘాయ్ కూడా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

అయితే బిజెపిలో చేరికకు ముందు సింఘాయ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికోసం పోటీలో నిలిచాడు. పలుమార్లు వాయిదా పడ్డ ఈ ఎన్నికలు ఇటీవల జరిగాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,శ్రేణులు సింఘాయ్ పార్టీన వీడినట్లు గుర్తించలేకపోయారు. దీంతో అతడు కూడా పోటీలో నిలిచాడు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 12 ఓట్ల తేడాతో విజయం కూడా సాధించాడు. 

ఈ క్రమంలోనే అతడికి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గెలుపొందినట్లు సమాచారం అందింది. ఈ మెసేజ్ ను చూసి ఆశ్చర్యపోవడం అతడి వంతయ్యింది. ఇలా బిజెపిలో వుండి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు హర్షిత్ సింఘాల్.

click me!