
ప్రధాన నరేంద్ర మోదీ నివాసంలో అర్దరాత్రి బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ విదేశీ నుంచి తిరిగి వచ్చిన కొద్ది రోజులకే ఈ భేటీ జరగడం గమనార్హం. 5 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో పార్టీలో భారీ పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి.
విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ భోపాల్‌లో తొలి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రతిపాదన చాలా కాలంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక, కేంద్ర మంత్రి వర్గంలోనూ మార్పులకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.
మరోవైపు కర్ణాటకలో బీజేపీ ఓటమి నేపథ్యంలో.. ఈ ఏడాది చివరిలో జరగనున్న తదుపరి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన ప్రచార విధానంపై కూడా చర్చలు జరిపినట్టుగా సమాచారం. ఇక, ఈ ఏడాది చివరిలో నాలుగు కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మధ్యప్రదేశ్‌లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో అధికార వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజీేపీ భావిస్తోంది.
నరేంద్ర మోదీ అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు పూరైన సందర్భంగా.. కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ సంస్థాగత సభ్యులు నెల రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లి భారీ కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది 2024 లోక్‌సభకు ముందు పార్టీకి మద్దతు పెంచడానికి ఉపకరిస్తుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది.