యోగీకి మరో ఎదురు దెబ్బ: కైరానాలో ఓటమి దిశగా బిజెపి

First Published May 31, 2018, 1:45 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. కైరానా లోకసభకు ఉప ఎన్నికల్లో బిజెపి వెనకబడి పోగా, నూర్పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైంది. బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి.

కొద్ది నెలల క్రితమే గోరక్ పూర్, పుల్పూర్ లోకసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలైంది. గోరక్ పూర్ స్థానానికి యోగీ ఆదిత్యానాథ్ రాజీనామా చేయడంతో, పుల్పూర్ స్తానికి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ రెండు స్థానాలను బిజెపి కోల్పోవడంతో యోగీ ఆదిత్యనాథ్ కు ఎదురు దెబ్బ తగిలింది.

కైరానా లోకసభ స్థానం, నూర్పూర్ అసెంబ్లీ స్థానం ఫలితాల ద్వారా ఆయనకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కైరానాలో 14 రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత రాష్ట్రీయ లోక్ దల్ (ఆర్ఎల్డీ) అభ్యర్థి తబస్సుమ్ హసన్ 40 వేల ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. 

నూర్పూర్  అసెంబ్లీ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్తి నైమ్ హసన్ బిజెపి అభ్యర్థి అవానీ సింగ్ ను ఓడించారు. యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ ఉత్తరప్రదేశ్ లో బిజెపికి ఎదురు దెబ్బ తగులుతూ వచ్చింది. 

ప్రతిపక్షాలు ఏకం కావడం ద్వారా బిజెపి ఓటమి పాలవుతోంది. గోరక్ పూర్, ఫుల్పూర్ ల్లో బిఎస్పీ, ఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి. కైరానా, నూర్పూర్ ల్లో కూడా పరిస్థితి అదే. కైరానాలో కాంగ్రెసు, ఎస్పీ, బిఎస్పీ తబస్సుమ్ కు మద్దతు ఇచ్చాయి. దీంతో ఆమె భారీ ఆధిక్యతతో విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. 

బిజెపి నాయకుడు హుకుమ్ సింగ్ మృతితో కైరానాకు ఉప ఎన్నిక జరిగింది. ఆయన కూతురు మృగాంక సింగ్ ను బిజెపి బరిలోకి దింపింది. సానుభూతి పవనాలు కూడా ఆమెను గెలిపించలేకపోయాయి. 

బిజెపి ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ మృతి కారణంగా నూర్పూర్ శాసనసభ స్థానానికి ఎన్నిక జరిగింది. 

click me!