
Mallikarjun Kharge: దేశంలోని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల అధికారాలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రజా విభజన చర్యలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుందటూ విమర్శించిన ఆయన.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పదవికి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. కాగా, కాంగ్రస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో ఆ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గేతో పాటు కేరళ ఎంపీ శశి థరూర్ కూడా ఉన్నారు. అక్టోబర్ 17న ప్రతి రాష్ట్ర రాజధానిలో రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. 9,000 మందికి పైగా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
"కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోంది. స్వయంప్రతిపత్తి గల అధికారులను బలహీనపరుస్తుంది" అని మల్లికార్జున ఖర్గే మీడియాతో అన్నారు. "కాబట్టి, బీజేపీతో పోరాడటానికి, రాజ్యాంగం-ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, నేను ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాను" అని మల్లికార్జున ఖర్గే అన్నారు. చంఢీగఢ్ పర్యటన సందర్భంగా, 80 ఏళ్ల ఖర్గే.. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్‌లోని పార్టీ యూనిట్లకు చెందిన సీనియర్ నాయకులు, 500 మందికి పైగా సభ్యులతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ సమావేశానికి పర్తాప్ సింగ్ బజ్వా, రాజిందర్ కౌర్ భట్టల్, దీపేందర్ సింగ్ హుడా సహా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల పోటీలో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
తన ఎన్నికల ప్రత్యర్థిపై అడిగిన ప్రశ్నకు ఖర్గే స్పందిస్తూ.. శశి థరూర్‌ను "మా కుటుంబ సభ్యుడు. నాకు తమ్ముడు" అంటూ ఆయన అభివర్ణించారు. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధానికి చేరుకోడానికి సంబంధించి గంటకు పైగా ఆలస్యమైనప్పటికీ.. సమిష్టి నాయకత్వంపై తనకు నమ్మకం ఉందనీ, అందరినీ సంప్రదించి, నిర్ణయాలు తీసుకునే ముందు అందరినీ విశ్వాసంలోకి తీసుకుంటానని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తన పునాదిని కోల్పోయిందని వారు పేర్కొంటున్నారనీ, అయితే ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ ఉపయోగించే మార్గాలు అందరికీ తెలుసునంటూ విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేసిందనీ, వారిని వేటాడిందని, దాని వల్లే కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, ఇటీవల మహారాష్ట్రలో ప్రభుత్వాలను కోల్పోయామని ఖర్గే పేర్కొన్నారు.
“మా పోరాటం వీధుల నుండి పార్లమెంటు వరకు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనేది ముఖ్యం. ద్రవ్యోల్బణం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, జీడీపీ వృద్ధి పడిపోవడం, రూపాయి విలువ క్షీణించడం వంటి ఇతర సమస్యలు దేశంలో ఉన్నాయి”అని ఖర్గే అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ సభ్యులతో తాను జరిపిన సమావేశాలు, చర్చలపై, పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ దృష్టి పెట్టాల్సిన అంశాలను వారి ముందు ఉంచుతానని అన్నారు. “ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లోని నిర్ణయాలు, వాటన్నింటినీ అమలు చేయడానికి మేము ప్రయత్నిస్తామని నేను వారికి చెప్పాను. అన్ని నిర్ణయాలను అమలు చేయడమే నా మొదటి ప్రాధాన్యత" అని ఆయన అన్నారు. వరుస ఎన్నికల పరాజయాల నేపథ్యంలో పార్టీ పునర్నిర్మాణం, పునరుద్ధరణ కోసం పార్టీ వ్యూహాన్ని రూపొందించడానికి మేలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ మూడు రోజుల మేధోమథన సమావేశం 'చితన్ శివిర్' నిర్వహించిన సంగతి తెలిసిందే.
సమిష్టి నాయకత్వంపై తనకు నమ్మకం ఉందనీ, నిర్ణయాలు తీసుకునే ముందు అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని ఖర్గే నొక్కి చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా సీనియర్ నాయకత్వాన్ని సంప్రదిస్తామని కూడా ఆయన చెప్పారు.