
టెర్రరిస్టుల దాడిలో బీజేపీ కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో చోటుచేసుకుంది. స్నేహితుడికి ఇంట్లో ఉన్న సమయంలో ఆయనను ఉగ్రవాదులు బంధించి మరీ.. దారుణంగా చంపేయడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ కశ్మీర్ లోని థ్రాలే కౌన్సిలర్ రాకేష్ పండిట్ ను ఉగ్రవాదులు బుధవారం రాత్రి అతి దారుణంగా కాల్చి చంపేశారు. ఉగ్రవాదుల బెదిరింపుల నేపథ్యంలో ఆయనకు శ్రీనగర్ లో ప్రభుత్వ వసతి, ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా నియమించారు.
అయితే.. బుధవారం ఆయన భద్రతా సిబ్బంది లేకుండా.. స్నేహితుని ఇంటికి వెళ్లారు. ఆ సమాచారం తెలుసుకున్న ఉగ్రవాదులు ఆయనను బంధించారు. అనంతరం దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటనలో అతని స్నేహితుడి కుమార్తె కూడా తీవ్రంగా గాయపడటం గమనార్హం.
ఈ ఏడాదిలో కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో ముగ్గురు కౌన్సిలర్లు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 30న ఉగ్రవాదులు సోపోర్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలోకి చొరబడి ఇద్దరు కౌన్సిలర్లతో పాటు ఓ పోలీస్ అధికారి కాల్చి చంపారు. రాకేశ్ పండిట్ హత్యను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. రాకేశ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. హత్యపై బీజేపీ ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ ఖండించారు. ఇలాంటి దాడులు బీజేపీ నాయకులను ప్రజలకుసేవ చేయకుండా ఆపలేవన్నారు. పోలీసులు నిందితులను గుర్తించి వారిని శిక్షించాలని కోరారు.