చివరి రోజు ట్విస్ట్.. ఢిల్లీ మేయర్ అభ్యర్థిగా రేఖా గుప్తాను ప్రకటించిన బీజేపీ..

By Sumanth KanukulaFirst Published Dec 27, 2022, 12:26 PM IST
Highlights

మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించి పలురకాల కామెంట్స్ చేసిన బీజేపీ.. తాజాగా కీలక ప్రకటన చేసింది. మేయర్, డిప్యూటీ మేయర్‌తో సహా వివిధ పదవులకు బరిలో నిలిపే అభ్యర్థులను ఖరారు చేసింది. 

మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించి పలురకాల కామెంట్స్ చేసిన బీజేపీ.. తాజాగా కీలక ప్రకటన చేసింది. మేయర్, డిప్యూటీ మేయర్‌తో సహా వివిధ పదవులకు బరిలో నిలిపే అభ్యర్థులను ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలు చివరి రోజున ఈ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ మేయర్ అభ్యర్థిగా షాలిమార్ బాగ్ నుంచి మూడుసార్లు కౌన్సిలర్ అయిన రేఖా గుప్తాను, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా రామ్ నగర్ వార్డుకు చెందిన కమల్ బగ్రీ ప్రకటించింది. ఇక,  జనవరి 6వ తేదీన మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మేయర్ ఎన్నిక జరగనుంది. 

ఇక, స్టాండింగ్ కమిటీ సభ్యుని అభ్యర్థిగా ద్వారక నుంచి పార్టీ కౌన్సిలర్‌గా ఉన్న కమల్జీత్ సెహ్రావత్‌ను బీజేపీ ప్రకటించింది. కమల్జీత్ సెహ్రావత్‌ గతంలో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 134 స్థానాలు గెలుచుకుని విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. మేయర్ పదవికి షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ పదవికి ఆలే మొహమ్మద్ ఇక్బాల్‌‌ను ప్రకటించింది. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక, షెల్లీ ఒబెరాయ్.. ఈస్ట్ పటేల్ నగర్ నుంచి కౌన్సిలర్‌గా, ఆలే మొహమ్మద్ ఇక్బాల్‌‌.. చందానీ మహల్ నుంచి కౌన్సిలర్‌గా ఉన్నారు. 

ఇక, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇటీవల ఎన్నికలు జరగగా.. మొత్తం 250 మంది స్థానాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 134 స్థానాలు, బీజేపీ 104 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే ఫలితాలు వెల్లడైన తర్వాత బీజేపీ నేతలు మేయర్ పదవి అనేది.. ‘‘ఓపెన్ పోస్ట్’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత మరికొందరు నేతలు ఆప్ నుంచే మేయర్ ఎన్నికవుతారని వ్యాఖ్యానించారు. అయితే నామినేషన్ల దాఖలు చివరి రోజున బీజేపీ.. తాము బరిలో నిలస్తున్నట్టుగా ప్రకటించింది. 

అయితే కొద్ది రోజుల క్రితం ఆప్ నేతలు.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పదవికి బీజేపీ వారి సొంత అభ్యర్థిని బరిలో నిలపాలని సవాలు చేశారు. రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. బీజేపీ మేయర్ పదవికి ఎవరిని పోటీలో ఉంచడం లేదని చెబుతుందని అన్నారు. ‘‘మేయర్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థికి బీజేపీ మద్దతు ఇస్తోందని మేము విన్నాము. బీజేపీ వారి అభ్యర్ధిని పోటీ చేయించకపోవడం అంటే వారు భయపడుతున్నారా?’’ అని ప్రశ్నించారు. 

click me!