Bihar thunderstorm 17 killed: దేశంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య భారతంతో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. ఉత్తరభారతంలోని వానలు దంచికొడుతున్నాయి. బీహార్ లో ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పిడుగుపాటు కారణంగా ఆదివారం నాడు బీహార్‌లో ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. పిడుగుపాటుతో 17 మంది మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా భాగల్‌పూర్‌లో 3, వైశాలిలో 3, ఖగారియాలో 2, కతిహార్‌లో 1, సహర్సాలో 1, మాధేపురాలో 1, బంకాలో 2 మరియు ముంగేర్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. చనిపోయిన వారందరికీ తక్షణమే రూ. 4 లక్షలు అందజేస్తాం. అని ట్వీట్ చేశారు.
ప్రతికూల వాతావరణంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పిడుగుపాటుకు గురికాకుండా ఉండేందుకు విపత్తు నిర్వహణ శాఖ ఇచ్చిన సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. "ప్రజలు ప్రతికూల వాతావరణంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలి. పిడుగుపాటుకు గురికాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ శాఖ ఇచ్చే సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న సమయంలో ఇంట్లోనే ఉండండి.. చెడు వాతావరణంలో సురక్షితంగా ఉండండి" అని ఆయన తెలిపారు. ఇదిలావుండగా, నైరుతి రుతుపవనాలు గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్, విదర్భలోని మిగిలిన భాగాలు, ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, గంగానది పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మరియు బీహార్‌లలో చురుకుగా ముందుకు సాగుతున్నాయనీ, దీని కారణంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ విభాగం (IMD) ఆదివారం తెలిపింది.
ఉత్తర, మధ్య మరియు తూర్పు భారతదేశం అంతటా వచ్చే రెండు-మూడు రోజులలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. శనివారం, IMD తన బులెటిన్‌లో బీహార్, జార్ఖండ్, ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్‌లో రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాబోయే ఐదు రోజులలో బీహార్, జార్ఖండ్, ఒడిశా మరియు గంగానది పశ్చిమ బెంగాల్‌లో ఉరుములు/మెరుపులు/ఈదురు గాలులతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, ఆదివారం నాడు స్థానిక వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.