కుల గణనపై ఈ రోజు బిహార్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఆర్జేడీ, జేడీయూలు కౌంటర్ ఎటాక్ చేశాయి. తాము చేసిన సర్వే తప్పైతే దేశవ్యాప్తంగా బీజేపీ కుల గణన చేపట్టాలని, వారిని ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మాట్లాడుతూ కుల గణన గురించి కామెంట్ చేశారు. కుల గణనను బిహార్ ప్రభుత్వం తప్పుగా చేపట్టిందని, ఆ గణాంకాల్లో ఉద్దేశపూర్వకంగా ముస్లింలు, యాదవ్‌ల జనాభాను ఎక్కువగా చేసి చూపెట్టిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బిహార్ ప్రభుత్వంలో భాగమైన ఆర్జేడీ, జేడీయూలు ప్రతిదాడికి దిగాయి. కౌంటర్ ఎటాక్ చేశాయి.
అమిత్ షా వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ‘అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నేను విన్నాను. కుల గణనలో ముస్లింలు, యాదవుల సంఖ్యను పెంచి, ఇతర సముదాయాల జనాభా సంఖ్యను కుదించినట్టు ఆయన పేర్కొన్నారు. నేను ఏం చెప్పదలిచానంటే.. మేం చేపట్టిన సర్వే తప్పే అయితే, దేశవ్యాప్తంగా మీరు కుల గణన చేపట్టండి. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మీరు ఎందుకు ఆ పని చేయడం లేదు?’ అని అన్నారు.
undefined
Also Read: బీజేపీ ‘హంగ్’ ఆశలు? ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు దేనికి సంకేతం?
జేడీయూ చీఫ్ లలన్ సింగ్ కూడా అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. ‘ఈ రోజు అమిత్ షా మాట్లాడుతూ, కుల గణనకు బీజేపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడే నిర్ణయం జరిగినట్టు చెప్పారు. ఆ మాటతో పాటు మరికొన్ని మాటలు కూడా ఆయన చెప్పాల్సింది. దేవశ్యాప్తంగా కుల గణన ప్రతిపాదనను కేంద్రంలోని బీజేపీ పార్టీనే తిరస్కరించింది. బిహార్‌లో కుల గణనను అడ్డుకోవడానికి పాట్నా హైకోర్టు, సుప్రీంకోర్టులో వారే పిటిషన్లు వేశారు. ఈ మాటలు కూడా అమిత్ షా చెప్పాల్సింది.’ అని కామెంట్ చేశారు.
ఈ రోజు ముజఫర్‌పూర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ షా నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. నితీశ్ ప్రభుత్వం సంతుష్టివాద రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. బిహార్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో ఉద్దేశపూర్వకంగా ముస్లింలు, యాదవ్‌ల జనాభా అధికంగా ఉన్నట్టు ప్రకటించిందని ఆరోపించారు.
అయితే, కుల గణన చేపట్టాలనే నిర్ణయం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ.. ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్నప్పుడే జరిగిందని అమిత్ షా ఈ సందర్భంగా వెల్లడించారు.