10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇప్పుడే గుర్తించారా? : నితీష్ కుమార్ పై ప్ర‌శాంత్ కిషోర్ విమ‌ర్శ‌లు

By Mahesh RajamoniFirst Published Sep 9, 2022, 11:14 AM IST
Highlights

బీహార్ రాజ‌కీయాలు: జేడీ(యూ) నాయ‌కుడు, బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ పై విమ‌ర్శ‌లు గుప్పించిన‌ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్.. ఢిల్లీలో నాయ‌కుల‌ను కలవడం అంటే జాతీయ స్థాయిలో హోదా పెరగడం కాదని అన్నారు.
 

Bihar Politics: బీహార్ రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. ఎన్డీయే నుంచి విడిపోయి.. బీజేపీ తెగ‌తెంపులు చేసుకున్న జేడీ(యూ) నాయకుడు నితీష్ కుమార్.. రాష్ట్రంలో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. బీజేపీ-జేడీ(యూ) మ‌ధ్య పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. ఇదే స‌మ‌యంలో నితీష్ కుమార్ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌, జేడీ(యూ) మాజీ నాయకుడు ప్ర‌శాంత్ కిషోర్ పై కూడా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న బీజేపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌ని ఆరోపించారు. ఆయ‌న ఒక  'పబ్లిసిటీ ఎక్స్‌పర్ట్' అని విమ‌ర్శించారు. దీంతో ప్ర‌శాంత్ కిషోర్.. నితీష్ కుమార్ కు కౌంట‌ర్ ఇస్తూ.. తీవ్ర విమర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. 

బీహార్‌లోని భాగల్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. జేడీ(యూ) నాయ‌కుడిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. సుమారు 17 సంవత్సరాలు బీహార్ ముఖ్య‌మంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ కు రాష్ట్రంలోని యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని అకస్మాత్తుగా గ్రహించార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “17 ఏళ్లు  ముఖ్య‌మంత్రిగా ఉన్న తర్వాత, 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమని నితీష్ కుమార్ గుర్తించారా? ఇంతకాలం ఎందుకు వేచి చూశారు? ఇంతకు ముందు ఎందుకు ఇవ్వలేదు? యువతకు 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, మేము ప్రచారం చేయము. మేము మీకు వెన్నుదన్నుగా నిలుస్తాము.. మీ కోసం పని చేస్తాము. అతను ఒక పెద్ద నాయకుడు, అతనికి 'A టూ Z' నుండి ప్రతిదీ తెలుసు..  ఇతరులకు ఏమీ తెలియదు... 12 నెలలు గడిచిపోనివ్వండి, అప్పుడు 'ABC' ఎవరికి తెలుసు.. 'XYZ' ఎవరికి తెలుసు అని అడుగుతాము" అని ప్ర‌శాంత్ కిషోర్ అన్నారు. 

విపక్షాల ఐక్యతను పెంపొందించేందుకు నితీష్ కుమార్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై కిషోర్ స్పందిస్తూ, కొత్తగా ఏమీ చేయడం లేదని అన్నారు. “ఇందులో కొత్తదనం ఏముంది, ప్రతిపక్షాలు కొత్తగా చేస్తున్నాయని ఎలా పరిగణించాలి? ఇది 2024 ఎన్నికలకు సంబంధించి నాటకీయ మార్పును తీసుకువస్తుందని నేను అనుకోను” అని ఆయన అన్నారు. నితీష్ ను టార్గెట్ చేస్తూ.. ఢిల్లీలో నాయ‌కుల‌ను కలవడం అంటే జాతీయ స్థాయిలో హోదా పెరగడం కాదని అన్నారు. “బీహార్ రాజకీయ పరిణామాలు రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకమైనవి. ఇది జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతుందని నేను అనుకోను. ఎవరైనా ఢిల్లీలో ప్రజలను కలుస్తున్నారంటే, జాతీయ స్థాయిలో ఒకరి స్థాయి పెరుగుతోందని అర్థం కాదు. మమతా బెనర్జీ, కేసీఆర్ కూడా ఢిల్లీలో చాలా మందిని కలిశారని ప్ర‌శాంత్  కిషోర్ అన్నారు.

నితీష్ కుమార్ ఇక్కడ వృద్ధ నాయకుడని ప్రశాంత్ కిషోర్ అన్నారు. వారు ఏదైనా చెప్పాలనుకుంటే, అప్పుడు మాట్లాడనివ్వండి. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదు. అతను ఏదైనా మాట్లాడినట్లయితే, అది అతని ఆలోచన. బీజేపీతో ఎవరు కలిసి పనిచేస్తున్నారు? నాకు-మీకు (మీడియా) తెలిసినంత వరకు నితీష్ కుమార్ ఒక నెల క్రితం వరకు బీజేపీతో ఉన్నారు. నితీష్ కుమార్ ఎవరికైనా అలాంటి సర్టిఫికేట్ ఇస్తున్నారంటే విడ్డూరంగా ఉంది అని ప్ర‌శాంత్ కిషోర్ అన్నారు. కాగా, ఆగస్టు 15న పాట్నాలోని గాంధీ మైదాన్ నుండి స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రసంగంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ (యునైటెడ్) కూటమి ప్రభుత్వం.. క‌నీసం 10 లక్షల ఉద్యోగాలు-అదనంగా వివిధ రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి అవ‌కాశాల‌ను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

click me!