బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్

By Siva KodatiFirst Published Oct 28, 2020, 7:56 PM IST
Highlights

బీహార్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 51.91 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 6 గంటల వరకు క్యూలైన్‌లో వున్నవారికి ఎంత సమయమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. 

బీహార్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 51.91 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 6 గంటల వరకు క్యూలైన్‌లో వున్నవారికి ఎంత సమయమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. 

బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. తొలి విడతలో ఇవాళ మొత్తం 71 స్థానాలకు పోలింగ్ జరుపుతున్నారు. అందువల్ల ఈ దశలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించడమే టార్గెట్‌గా పార్టీలన్నీ జోరు ప్రచారం సాగించాయి.

తొలివిడతలో మొత్తం 6 జిలాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ జిల్లాల్లోని 71 నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీల తరఫున మొత్తం 1066 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 114 మంది మహిళలు ఉన్నారు.

ఆర్జేడీ నుంచి 42 మంది, జేడీయూ నుంచి 41 మంది, బీజేపీ నుంచి 29, కాంగ్రెస్ నుంచి 21 మంది, ఎల్జేపీ నుంచి 41 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఒక్కో బూత్‌లో 1600 నుంచి 1000 మంది ఓటర్లు మాత్రమే ఓటు వేసేలా ఏర్పాటు చేశారు.

80 ఏళ్లకు పైబడిన వారు పోస్ట్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి సైతం ఆ అవకాశాన్ని కల్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శానిటైజ్ చేయడంతో పాటు పోలింగ్ సిబ్బందికి మాస్కులు, ఇతర రక్షణ సామగ్రిని అందించారు.

మొదటి విడతలో మొత్తం 2.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసారి ఎన్డీఏ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులు ప్రచారం చేశారు.

నితీష్ కుమార్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లను ప్రధాని కోరారు. ఇక కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమి తరపున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తేజశ్వి ప్రసాద్ యాదవ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

రెండో విడతగా నవంబరు 3న 94 స్థానాలకు, నవంబరు 7న మూడో విడతలో 78 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు. అలాగే నవంబర్ 10న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించి, ఫలితాలను వెల్లడిస్తారు.

click me!