లాలూ కి కోడలు షాక్: కొడుకుపై పోటీకి సై

By team teluguFirst Published Sep 9, 2020, 5:38 PM IST
Highlights

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ తగిలేలా ఉంది. లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కి వ్యతిరేకంగా ఆయన భార్య, లాలూ కోడలు ఐశ్వర్య పోటీ చేయనున్నట్టు సమాచారం.

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ తగిలేలా ఉంది. లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కి వ్యతిరేకంగా ఆయన భార్య, లాలూ కోడలు ఐశ్వర్య పోటీ చేయనున్నట్టు సమాచారం. 

ఆర్జేడీ పార్టీ కీలక నేత చంద్రిక రాయి కూతురిని తన పెద్ద కొడుక్కిచ్చి వివాహం చేసాడు లాలూ ప్రసాద్ యాదవ్. కానీ పెళ్లయిన 5 నెలలకె వారిరువురు విడాకులకు అప్లై చేసారు. అప్పటి నుండి ఇరు కుటుంబాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. చంద్రిక రాయ్ ఆర్జేడీ కి రాజీనామా చేసి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ లో చేరిపోయాడు. 

తాజాగా ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.... తన కూతురు ఎక్కడినుండైనా పోటీ చేసే అవకాశం తనకు ఉంటుందని, తాను ఆమెను వారించబోనని చెప్పుకొచ్చాడు. ఆమె ఎక్కడి నుండి పోటీ చేయాలనుకుంటే అక్కడి నుండి చేస్తుందని, తన ఇష్టం అని ఆయన వ్యాఖ్యానించాడు. త్వరలోనే ఐశ్వర్య తన కార్యాచరణ ప్రకటిస్తుందని కూడా రాయ్ తెలిపారు. 

ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్ తన ప్రస్తుత నియోజకవర్గాన్ని మార్చుకోవాలనుకుంటున్నాడు. ప్రస్తుతం మహువా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తేజ్ ప్రతాప్.... ఐశ్వర్య గనుక అక్కడి నుండి పోటీ చేస్తే తనకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తొచ్చు అని భావిస్తున్నాడు. గత ఎన్నికల్లో 28 వేల పైచిలుకు మెజారిటీతో ఇక్కడి నుండి గెలిచినప్పటికీ.... తేజ్ ప్రతాప్ కి ఎందుకో ఇక్కడ నుండి గెలుపు పై నమ్మకం లేదు. 

తాజాగా ఆయన హాసన్ పూర్ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. దీనితో తేజ్ ప్రతాప్ ఇక్కడి నుండి పోటీ చేయొచ్చు అనే ఊహాగానాలు వినబడుతున్నాయి. హాసన్ పూర్ అయితే ఆర్జెడీకి బాగా బలమున్న ప్రాంతం. అక్కడ సామజిక సమీకరణాలు తేజ్ ప్రతాప్ కి బాగా కలిసి వస్తాయి. 

హాసన్ పూర్ లో ముస్లిం, యాదవ జనాభా అధికం. ప్రకృతికంగా ఆర్జేడీ వోట్ బ్యాంకు కూడా ఇదే. దీనితో అక్కడి నుండి పోటీ చేస్తే గెలుపు తథ్యం అని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం అది జేడీయూ ఖాతాలో ఉన్నప్పటికీ... తేజ్ ప్రతాప్ పోటీ చేస్తే అది ఆర్జేడీ వశమవుతుందని పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. 

click me!