
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో సందడి నెలకొంది. లాలూ ప్రసాద్ కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తండ్రి అయ్యాడు. తేజస్వీ యాదవ్ భార్య రాజశ్రీ యాదవ్ ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఈ విషయాన్ని తేజస్వీ యాదవ్ సోదరి రోహిణి ఆచార్య సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మరోవైపు తేజస్వీ యాదవ్ కూడా తనకు కూతురు పుట్టిందని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘‘దేవుడు సంతోషించి కూతురి రూపంలో బహుమతి పంపాడు’’ అని తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు.
‘‘ఈరోజు కిచకిచ నా ఇంటి ప్రాంగణంలో ప్రతిధ్వనిస్తోంది. భగవంతుడు అలాంటి ఆనందాన్ని ఇచ్చాడు. అన్న-వదినల ముఖంలో చిరునవ్వు విరజిమ్మాలి. నా ఇంట్లో సంతోషం ఎప్పుడూ ఉండాలి. ఆనంద సాగరంలో మునిగిపోయారు. సోదరుడు తండ్రి అయినందుకు సంతోషంగా ఉంది. సోదరుడు తేజస్వీ ముఖంలో ఆ ఆనందాన్ని చూడొచ్చు.. చిన్న దేవదూతగా నా ఇంటికి అతిథి రావడం జరిగింది. సంతోషాన్ని బహుమతిగా వచ్చింది. దాదా-దాదీలు సంతోషంలో మునిగిపోయారు’’ అని రోహిణి ఆచార్య వరుస ట్వీట్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇక, తేజస్వి యాదవ్ తన చిరకాల స్నేహితురాలు రాజశ్రీ యాదవ్‌ను 2021 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుక కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. రాజశ్రీ హర్యానాలోని రేవారీకి చెందినవారు కాగా.. ఆమె చిన్నతనం నుంచి ఢిల్లీలోనే నివసించారు.