
బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే, ప్రస్తుతం శరీరంలోని అన్ని కీలక వ్యవస్థలు సక్రమంగానే పనిచేస్తున్నాయని మోడీ పేర్కొన్నారు.
తొలుత స్వల్ప జ్వరం ప్రారంభమైందని అయితే, గడిచిన రెండు రోజులుగా శరీర ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పులు లేవని తెలిపారు. సీటీ స్కాన్ రిపోర్టు కూడా సాధారణంగానే ఉందని సుశీల్ చెప్పారు. ప్రస్తుతం పాట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సుశీల్ మోడీ, మరికొన్ని రోజుల్లోనే కోలుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాననే ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు బిహార్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ, అక్కడ వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
కాగా, రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలో బీజేపీ, జేడీయూ ఎన్డీఏ కూటమిగా కలిసి పోటీచేస్తుండగా.. మాజీ సీఎం లాలు కుమారుడు తేజస్వీ సారథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి మహాకూటమిగా ఎన్నికల్లో దిగాయి.
దీంతో పాటు శివసేన కూడా 50 సీట్లల్లో పోటీచేస్తుండగా.. ఎన్డీఏ కూటమిలోని చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగింది