వరకట్న దురారాచారంపై సీఎం ఫైర్.. ‘పురుషుడు మరో పురుషుడిని పెళ్లాడితే...’

By Mahesh KFirst Published May 25, 2022, 4:25 PM IST
Highlights

నేటి సమాజంలో వరకట్న దురాచారం చాలా నీచమైనదని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఒక పురుషుడు ఒక మహిళ పెళ్లి చేసుకుంటేనే సంతానం సాధ్యం అవుతుందని, అది ప్రకృతి నియమం అని, దానికి వరకట్నం ఇవ్వడం పనికి మాలిన చర్య అని అభిప్రాయపడ్డారు. వరకట్నాన్ని రూపుమాపాలని పిలుపు ఇచ్చారు.
 

పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్ వరకట్న దురాచారంపై ఫైర్ అయ్యారు. ప్రస్తుత సమాజంలో ఉనికిలో ఉన్న నీచమైన ఆచారం ఇది అని మండిపడ్డారు. పెళ్లి కోసం వరకట్నం తీసుకోవడం పనికిమాలిన చర్యల అని పేర్కొన్నారు. ఒక పురుషుడు.. మహిళను వివాహం చేసుకోవడమే ప్రకృతి నియమం అని, దానికి వరకట్నాన్ని అంటకట్టడం సరికాదని పేర్కొన్నారు. ఒక పురుషుడు.. ఒక మహిళను మనువాడితేనే పునరుత్పత్తి  అంటే సంతానం సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. అదే ఒక పురుషుడిని.. మరో పురుషుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారా? అని ప్రశ్నించారు.

పాట్నాలో సోమవారం మగధ మహిళ కళాశాల గర్ల్స్ హాస్టల్‌ను సీఎం నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వరకట్న దురాచారంపై మండిపడ్డారు. పిల్లలు పెళ్లి చేసుకుంటేనే పుడతారని అన్నారు. ఇక్కడ ఉన్నవారంతా అమ్మ కడుపు నుంచి పుట్టినవారేనని, అమ్మ లేకుండా మన ఉనికి అసాధ్యం అని తెలిపారు. మహిళలు లేకుండా మనం ఎలా పుట్టగలం? అని ప్రశ్నించారు. ఒక వేళ ఒక పురుషుడు, మరో పురుషుడిని పెళ్లి చేసుకుంటే సంతానం అనే పునరుత్పత్తి సాధ్యం అవుతుందా? అని అడిగారు.

ఇలాంటి సామాజిక దురాచారాలను అన్నింటిని రూపుమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం నితీష్ కుమార్ అన్నారు. బాలికలు విద్యావంతులను చేసి వారిని సాధికారికం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నదని వివరించారు.

నేటి సమాజంలో వరకట్న ఆచారం అతి నీచమైనదని ఆయన అన్నారు. దీన్ని అంతమొందించే బాధ్యత అందరిపైనా ఉన్నదని తెలిపారు. ఈ దురాచారాన్ని ఆపడానికి అందరూ ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. అలాగైతేనే.. ఈ సమాజం సంస్కరించబడుతుందని వివరించారు.

తన కాలంలో ఇంజనీరింగ్ లేదా మెడికల్ కోర్సుల్లో చాలా తక్కువ మంది బాలికలు చదువుతుండేవారని చెప్పారు. అది చాలా బాధాకరమైన విషయం అని పేర్కొన్నారు. ఒక కోర్సులో ఏకైక బాలిక ఎన్రోల్ అయితే.. అందరూ ఆమె వైపే చూస్తుంటారని అన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. ఇప్పుడు చాలా మంది బాలికలు ఈ కోర్సుల్లో చేరుతున్నారని వివరించారు. అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు.

వరకట్నం ఆచారాన్ని పాటిస్తున్న వివాహ వేడుకలను బహిష్కరించాలని సీఎం నితీష్ కుమార్ పిలుపు ఇచ్చారు. తాము ఎలాంటి వరకట్నాన్ని తీసుకోవడం లేదని ప్రకటించిన పెళ్లిళ్లకే హాజరవ్వాలని వివరించారు.

click me!