ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు హైకోర్టులో ఊరట.. అభ్యంతరకర పోస్టులను తొలగించాలని ఆప్‌కు ఆదేశం

By Mahesh KFirst Published Sep 27, 2022, 2:20 PM IST
Highlights

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై అవమానకర పోస్టులు సోషల్ మీడియాలో పోస్టు చేయరాదని ఆప్‌కు ఆదేశాలు జారీ చేసింది.
 

న్యూఢిల్లీ: ఆప్ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య జరుగుతున్న ఆరోపణ ప్రత్యారోపణల పర్వం హైకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. తాజాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా, అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులను వెంటనే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ఆదేశించింది.

ఈ నెల 22వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై, తన కుటుంబంపై చేస్తున్న అసత్యపు ఆరోపణలకు అడ్డుకట్ట వేయడానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఆప్ నేతలు అతిషి సింగ్, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, సంజయ్ సింగ్, జాస్మిన్ షా‌లు తనపై తప్పుడు, అవమానపరిచే పోస్టులను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని, వారికి వ్యతిరేకంగా ఇంజంక్షన్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు.

లెప్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఖాది, విలేగ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్‌గా ఉన్నప్పుడు రూ. 1,400 కోట్ల స్కామ్ జరిగిందని, అందులో వినయ్ కుమార్ సక్సేనా ప్రమేయం ఉన్నదని ఆప్ ఆరోపణలు చేస్తున్నది. 

ఈ నేపథ్యంలోనే ఇంజంక్షన్ ఆదేశాలతోపాటు పరువు నష్టం కింద తనకు రూ. 2.5 కోట్ల పరిహారాన్ని మిత్తితోపాటు కలిపి ఇవ్వాలని పిటిషన్ వేశారు.

తనపై అవమానకర ప్రకటనలు చేయవద్దని కోరుతూ ఆప్‌కు లీగల్ నోటీసులు సెప్టెంబర్ 5వ తేదీన పంపారు.

click me!