గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్.. ముహుర్తం ఖరారు.. హాజరుకానున్న మోదీ, షా..

By Sumanth KanukulaFirst Published Dec 8, 2022, 2:40 PM IST
Highlights

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. అక్కడ వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. అక్కడ వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ  స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకులు వివరాలు వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు కూడా భూపేంద్ర పటేల్ ప్రమాణ  స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సీఆర్ పాటిల్ తెలిపారు. భూపేంద్ర పటేల్ ప్రమాణ  స్వీకార కార్యక్రమం డిసెంబర్ 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని చెప్పారు. గుజరాత్ వ్యతిరేక శక్తులన్నింటినీ రాష్ట్ర ప్రజలు ఓడించారని కూడా కామెంట్ చేశారు. 

గుజరాత్‌లో ప్రతిపక్షాలను చిత్తుచేసి బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే స్పష్టమైన ఆధిక్యత కనబరస్తూ వచ్చింది. ఇప్పటివరకు ఎన్నికల సంఘం వెల్లడించిన ఫలితాల ప్రకారం.. బీజేపీ 132 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 25 స్థానాల్లో ముందజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో విజయం సాధించగా, 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆప్ 5 స్థానాల్లో, సమాజ్‌వాదీ పార్టీ ఒక్క స్థానంలో, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

ప్రజల ఆదేశాన్ని పార్టీ వినమ్రంగా అంగీకరించిందని భూపేంద్ర పటేల్ చెప్పారు. గుజరాత్‌లో అభివృద్ధి పథంలో కొనసాగాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. ప్రధాని మోదీ కృషితోనే ఇంతటి ఘన విజయం దక్కిందని చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ది చెందుతుందన్నారు. మోదీ, అమిత్ షా నాయకత్వంలో గుజరాత్ అభివృద్ది జరుగుతుందని అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజాసేవకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇక, గుజరాత్‌లో బీజేపీ రికార్డు విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. గుజరాత్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. 

ఇక, 1995 నుంచి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తూ వస్తుంది. గత 27 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండగా..  ఇంత భారీ ఆధిక్యతతో ఆ పార్టీ ఎన్నడూ గెలవలేదు.

click me!