అలప్పుజ నుండి భారత్ జోడో యాత్రను పునఃప్రారంభించిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యుద్ధం

Published : Sep 19, 2022, 12:09 PM IST
అలప్పుజ నుండి భారత్ జోడో యాత్రను పునఃప్రారంభించిన రాహుల్ గాంధీ..  కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యుద్ధం

సారాంశం

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నాయ‌కులు రాహుల్ గాంధీ అల‌ప్పుజ‌లోని పున్న‌ప్ర‌ అరవుకాడ్ నుండి భారత్ జోడో యాత్రను పునఃప్రారంభించారు. అంత‌కుముందు కేరళలోని కొల్లంలో కూరగాయల వ్యాపారి నుండి స్థానిక కాంగ్రెస్ నాయకులు విరాళాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపించిన వీడియో బయటకు రావడంతో భారత్ జోడో యాత్ర వివాదంలో చిక్కుకుంది.  

Congress leader Rahul Gandhi: కాంగ్రెస్ దేశ‌వ్యాప్త భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతోంది. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమవారం అలప్పుజలోని పున్నప్ర అరవుకడ్‌ నుంచి 'భారత్‌ జోడో యాత్ర'ను పునఃప్రారంభించారు.

12వ రోజుకు చేరిన భార‌త్ జోడో యాత్ర‌.. 

ఇప్పటి వరకు 200 కిలోమీటర్లకు పైగా భార‌త్ జోడో యాత్ర కొన‌సాగింది. అంతకుముందు, కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఉదయం అలప్పుజ జిల్లాలోని హరిపాడ్ నుండి కేరళ పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. తొట్టపల్లిలోని శ్రీ కురుట్టు భగవతి ఆలయంలో పాదయాత్ర ఆగుతుంది. అలాగే, సాయంత్రం వందనంలోని టీడీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో యాత్ర ఆగుతుంది. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో కొన‌సాగుతున్న భార‌త్ జోడో యాత్ర‌.. త‌ర్వాత 12 రోజుల పాటు కేర‌ళ గుండా త‌న ప్ర‌యాణం కొన‌సాగించ‌నుంద‌ని సంబంధిత కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి. 

3500 కిలో మీట‌ర్ల‌కు పైగా సాగే భార‌త్ జోడో యాత్ర‌.. 

కాంగ్రెస్ పార్టీ దేశ‌వ్యాప్త భార‌త్ జోడో యాత్ర‌తో రానున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డంతో పాటు కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ఎత్తిచూప‌డం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ భార‌త్ జోడో యాత్ర‌ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల పైగా కొన‌సాగ‌నుంది. ఈ పాదయాత్ర 150 రోజుల్లో పూర్తవుతుంది. ఇది 12 రాష్ట్రాలను కవర్ చేస్తుంది. కేరళ నుండి యాత్ర తదుపరి 18 రోజుల పాటు రాష్ట్రం గుండా ప్రయాణించి, సెప్టెంబర్ 30న కర్నాటకకు చేరుకుంటుంది. అలాగే, ఉత్తర భార‌తంలోకి ప్ర‌వేశించే ముందు 21 రోజుల పాటు కర్ణాటకలో త‌న యాత్ర‌ను కొన‌సాగించ‌నుంది. నిత్యం 25 కిలో మీట‌ర్లు భార‌త్ జోడో యాత్ర సాగుతున్న‌ది. 

కొల్లం ఘటనతో మాటల యుద్ధం..

ఇదిలావుండగా, కేరళలోని కొల్లంలో కూరగాయల వ్యాపారి నుండి స్థానిక కాంగ్రెస్ నాయకులు విరాళాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపించిన వీడియో బయటకు రావడంతో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర వివాదంలో చిక్కుకుంది. భారత్ జోడో యాత్రకు నిధుల సేకరణకు రూ.2,000 ఇవ్వనందుకు కొల్లాంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూరగాయల దుకాణదారుని బెదిరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావ‌డంతో.. ఆ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న కార్య‌క‌ర్త‌ల‌ను సస్పెండ్ చేశారు. కొల్లంలోని కూరగాయల దుకాణదారు ఎస్ ఫవాజ్ ను..  కాంగ్రెస్ కార్యకర్తలు దుకాణంలోని తూకం మిషన్‌ను ధ్వంసం చేసి కూరగాయలను ధ్వంసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు గందరగోళం సృష్టించి దుకాణ సిబ్బందిపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ శుక్రవారం ముగ్గురు పార్టీ కార్యకర్తలను సస్పెండ్ చేసింది.

“కొల్లంలో ఆమోదయోగ్యం కాని సంఘటనలో పాల్గొన్న ముగ్గురు పార్టీ కార్యకర్తలను తక్షణమే సస్పెండ్ చేశారు. వారు మన భావజాలానికి ప్రాతినిధ్యం వహించరు. అలాంటి ప్రవర్తన క్షమించరానిది. కార్పొరేట్ విరాళాలు పొందే ఇతరులకు భిన్నంగా పార్టీ స్వచ్ఛందంగా చిన్న చిన్న విరాళాలకు క్రౌడ్ ఫండింగ్ చేస్తోంది” అని కేరళ కాంగ్రెస్ చీఫ్ కె సుధాకరన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇదే విషయంపై కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu
PM Modi Visit Oman: ఒమన్ లో మోదీకి ఘనస్వాగతంభారత ప్రజలు | Asianet News Telugu