సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలుల ప్రభావంతో జాగ్రత్తగా ఉండాలని బెంగుళూరు వాసులకు వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో వడగాలులపై వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో నీటి ఎద్దడి నెలకొంది. దరిమిలా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభం నుండి బెంగుళూరులో వేసవి తీవ్రత పెరుగుతూ వస్తుంది. బెంగుళూరులో 33 నుండి 34 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదౌతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించినట్టుగా డీహెచ్ రిపోర్టు చేసింది.
undefined
ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ఆరుబయట పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. గర్భిణీలు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. వడగాలులు, ఉష్ణోగ్రతలు పెరగడంతో బీపీ పెరగడం, గుండె సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆ నివేదిక తెలిపింది.
ఫసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో అసాధరణ మార్పులు వస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఎల్‌నినో ప్రభావం కారణంగా శీతాకాలంలో అధికంగా చలి ప్రభావం ఉన్న విషయాన్ని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దక్షిణాదిలోని కర్ణాటక రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కూడ నమోదు కాని విషయాన్ని వాతావరణ నిపుణులు గుర్తు చేస్తున్నారు.
వడగాలులు, ఉష్ణోగ్రతలు పెరిగితే ఆరోగ్య సమస్యలు పెరగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ద్రవ పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తగినంత నీటితో పాటు, నిమ్మరసం, బట్టర్ మిల్క్, లస్సీ, ఫ్రూట్ జ్యూస్ ను తరచుగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా శరీరంలో లవణాలు కోల్పోతారు. అందుకే తాగేనీటిలో కొంచెం ఉప్పును కూడ వేసుకొని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో తీసుకొనే ఆహారంలో ఎక్కువగా నీటి పరిమాణం ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.
కాటన్ దుస్తులు, లైట్ దుస్తులను ధరించడం ద్వారా ఎండ తీవ్రత నుండి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని కోరుతున్నారు.
బెంగుళూరును ఇండియా సిలికాన్ వ్యాలీగా పిలుస్తారు. వేసవి రాకముందే బెంగుళూరు నగరంలో తీవ్రమైన నీటి సమస్య నెలకొంది. బెంగుళూరు వాటర్ సప్లయి సీవరేజీ బోర్డు (బీడబ్ల్యుఎస్ఎస్‌బీ) వర్గాల సమాచారం మేరకు బెంగుళూరు శివారు ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సాఫ్ట్ వేర్ సంస్థలున్న ప్రాంతాల్లో కూడ ఈ సమస్య ఉంది.
సరైన వర్షాలు లేని కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో ప్రైవేట్ ట్యాంకర్లను నీటి కోసం ఆశ్రయిస్తున్నారు. అయితే నీటి డిమాండ్ పెరగడంతో ట్యాంకర్ల ధర కూడ పెంచారు.
ట్యాంకర్ నీటికి గతంలో రూ. 400 నుండి రూ.600 వసూలు చేసేవారు. కానీ, ప్రస్తుతం ఈ ధరను రూ. 800 నుండి రూ. 2000లకు పెంచారు. ఒక్క ట్యాంకర్ లో 12 వేల లీటర్ల నీరుంటుంది.