
బెంగళూరు : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాంసం అమ్మకాలను నిషేధిస్తూ బీబీఎంపీ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 19వ తేదీన శుక్రవారం బెంగళూరు నగరంలోని కబేలాలను మూసివేయాలని, మాంసం దుకాణాలు మూసి వేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో బెంగళూరు నగరంలో కబేళాలు మూసి వేయడంతో పాటు మాంసం రీటేల్ విక్రయ దుకాణాలను మూసి వేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
5,249వ కృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ అధికారులు మాంసం అమ్మకాలపై నిషేధం విధించారు. గతంలో శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ నెలలోనూ మాంసం అమ్మకాలను నిషేధించారు. బెంగళూరు నగరంలో బసవ జయంతి, మహాశివరాత్రి, గాంధీ జయంతి, సర్వోదయ డేల సందర్భంగా ఏడాదికి ఎనిమిది రోజుల పాటు మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఉన్నారు.