ఏది కావాలంటే అది సమకూరుస్తాం.. వ్యాక్సిన్ ఇప్పించండి: మోడీకి మమత లేఖ

By Siva KodatiFirst Published May 12, 2021, 8:45 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మరోసారి మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.  కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు భూమితో పాటు, అవసరమైనవన్నీ సమకూరుస్తామని దీదీ స్పష్టం చేశారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మరోసారి మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు భూమితో పాటు, అవసరమైనవన్నీ సమకూరుస్తామని దీదీ స్పష్టం చేశారు.

ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రానికి కొవిడ్‌ వ్యాక్సిన్లు వేగంగా దిగుమతి అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ల ఉత్పత్తికి దేశీయ, విదేశీ సంస్థలను ప్రోత్సహించాలని మమత కోరారు. దేశీయంగా వ్యాక్సిన్‌ తయారీ తగిన స్థాయిలో లేదని.. అంతర్జాతీయంగా అనేక మంది వ్యాక్సిన్‌ తయారీదారులు ఉన్నారని ఆమె చెప్పారు.

మంచి గుర్తింపు పొందిన, నాణ్యమైన వ్యాక్సిన్‌ తయారీదారులను గుర్తించి వ్యాక్సిన్‌ ఉత్పత్తిని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అవసరమైన వనరులు అందించడానికి బెంగాల్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మమత స్పష్టం చేశారు.  

Also Read:కేంద్రానికి మమత లేఖ: స్ట్రాంగ్ కౌంటరిచ్చిన నిర్మలా సీతారామన్

మరోవైపు టీకా ఉత్పత్తి పెంచి వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. తయారీ సంస్థలకు అవసరమైన సహకారం అందించడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా మే- జూన్‌ నాటికి కొవాగ్జిన్‌ ఉత్పత్తి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

జులై-ఆగస్టు నాటికి నెలకు 6-7కోట్ల డోసులు, సెప్టెంబరు నాటికి నెలకు 10 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి చేయాలని కసరత్తు చేస్తోంది. కొవాగ్జిన్‌ డోసుల ఉత్పత్తి సామర్థ్యం కొన్ని సంస్థలకే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.

click me!