బెంగళూరు వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడంలేదు. ట్రాఫిక్ నియంత్రణ కోసం చేపడుతున్న పనులే ఈ ట్రాఫిక్ కష్టాలకు కారణం కావడం ఆసక్తికరం.
Bangalore Traffic Jam : కర్ణాటక రాజధాని బెంగళూరు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది ట్రాఫిక్ జామ్. ఐటీ ఇండస్ట్రీకి కేంద్రమైనా ఈ మహానగరంలో ట్రాఫిక్ జామ్స్ సర్వసాధారణం. బెంగళూరు వాసులు ఈ ట్రాఫిక్ కష్టాలకు అలవాటుపడిపోయారు. అందుకేనేమో అధికారులు కూడా నగరవాసులు ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోకుండా పనులు చేపడుతుంటారు. ఇలా తాజాగా మెట్రో నిర్మాణపనుల కోసం చేపట్టిన చర్యలతో బెంగళూరులో ట్రాఫిక్ సమస్య రెట్టింపయ్యింది.
తాజాగా బెంగళూరు మెట్రో నిర్మాణ పనులకోసం హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో ప్లైఓవర్ మూసివేసారు. ఈ మేరకు ఎక్స్ వేదికన ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేసారు. మెట్రో పనుల కారణంగా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు... ప్రజలు సహకరించాలని కోరారు. ఇలా ప్లైఓవర్ మూసివేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది.
HSR లేఅవుట్ బెంగళూరు శివారుప్రాంతం. ఇక్కడినుండి నిత్యం వేలాదిమంది ఐటీ, ఇతర ఉద్యోగులు ఈ ప్లైఓవర్ మీదుగానే ప్రయాణిస్తుంటారు. ఇలాంటి కీలకమైన దారిని మూసివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇలా వాహనాలన్నీ ఓఆర్ఆర్ పైకి చేరడంతో భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది.
TRAFFIC ADVISOTY
“Due to the tilt of the BMRCL sliding girdle at 14th Main, HSR Layout, the flyover is closed for traffic. Commuters are advised to use alternate routes.Outgoing traffic toward Silk Board is diverted via 19th Main. Kindly cooperate and plan your travel accordingly pic.twitter.com/xjv7mPGI5q
ముందుగా సమాచారం ఇవ్వకుండా ఇలా హటాత్తుగా ఓ ట్వీట్ చేసి దారిమళ్ళించడం ఏంటని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతానికి చెందినవారు మండిపడుతున్నారు. సరిగ్గా పిల్లలు స్కూళ్లు, తాము ఆఫీసులకు వెళ్లే సమయంలో ప్లైఓవర్ మూసివేయడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. చాలామంది ట్రాఫిక్ పోలీసుల ప్రకటన గురించి తెలియక ప్లైఓవర్ వైపు వస్తున్నారని...దారి మూసేసి వుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని అంటున్నారు.
స్కూళ్లు, ఆఫీసులకు సెలవుండే వారాంతాల్లో ఇలాంటి పనులు పెట్టుకోవాలి, లేదంటే రాత్రుళ్లు చేసుకోవాలి... కానీ ఇలా ప్రజలను ఇబ్బందిపెడుతూ పనులు చేయడం సరికాదని అంటున్నారు. అసలే నిత్యం ట్రాఫిక్ కష్టాలతో సతమతం అవుతున్న తమను మరింత ఇబ్బందిపెట్టడం తగదంటూ బెంగళూరు వాసులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.