
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్మూ రైల్వే స్టేషన్‌లోని పార్కింగ్ ప్రాంతంలో అనుమానస్పదంగా ఉన్న బ్యాగ్‌లో నుంచి 18 డిటోనేటర్లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని డ్రెయిన్‌ను శుభ్రం చేస్తుండగా ఒక బ్యాగ్ దొరికినట్టుగా తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. బ్యాగ్ లోపల రెండు పెట్టెలను గుర్తించిన పోలీసులు.. ఒకదానిలో పేలుడు పదార్థాలు, మరోదానిలో 18 డిటోనేటర్లు, కొన్ని వైర్లు ఉన్నాయని చెప్పారు.
‘‘మేము జమ్మూ రైల్వే స్టేషన్‌లోని టాక్సీ స్టాండ్ దగ్గర ఒక బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నాం. బ్యాగ్‌లో 2 బాక్సుల్లో ప్యాక్ చేసిన పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. 18 డిటోనేటర్లు, కొన్ని వైర్లు స్వాధీనం చేసుకున్నారు. బాక్స్‌లో దాదాపు 500 గ్రాముల మైనపు రకం పదార్థం ప్యాక్ చేయబడింది. సామాగ్రిని సీజ్ చేయడం జరిగింది’’ రైల్వే పోలీసు అధికారి ఆరిఫ్ రిషు చెప్పారు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో పలు ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడంతో అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అక్టోబర్ 18న ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన ఇద్దరు కూలీలు హర్మెన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించారు. హర్మెన్‌లో ఉగ్రవాదులు హ్యాండ్ గ్రెనేడ్‌ను లాబ్ చేశారని.. అందులో కూలీలు ఇద్దరూ గాయపడ్డారని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని చెప్పారు. గ్రెనేడ్ దాడి జరిగిన సమయంలో బాధితులు నిద్రలో ఉన్నారని తెలిపారు.
ఇక, అక్టోబరు 15న జరిగిన షోపియాన్ జిల్లాలోని చౌదరి గుండ్‌లో పురాణ్ కృష్ణన్ అనే కశ్మీర్ పండిట్‌ను ఆయన నివాసం వద్ద ఉగ్రవాదులు కాల్చిచంపారు. పురాణ్ కృష్ణన్ హత్య తమను భయాందోళనలకు గురిచేసిందని అతడి బంధువులు తెలిపారు.