UP Assembly Election 2022: రోడ్డు వేస్తేనే.. ఓటు వేసేది ! అధికారుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అల్టీమేటం !

By Mahesh RajamoniFirst Published Jan 22, 2022, 11:09 PM IST
Highlights

UP Assembly Election 2022: ఉత్త‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. అయితే, ప‌లు చోట్ల ప్ర‌జా ప్ర‌తినిధులకు చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే యూపీలోని ఓ గ్రామంలో అధ్వానమైన రోడ్ల‌ను గురించి గ్రామస్థులు నిరసన బాట పట్టారు. "నో రోడ్ నో ఓట్" అంటూ రోడ్లు కోసం ఎన్నికలను బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. రోడ్లు బాగు చేస్తేనే ఓట్లు వేస్తామంటూ అల్టీమేటం జారీ చేశారు. 
 

UP Assembly Election 2022: వ‌చ్చే నెల‌లో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు హీటు పెంచాయి. ఈ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అన్ని ప్ర‌ధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో యూపీ రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి.  అయితే, ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్న త‌రుణంలో ప‌లు చోట్ల ప‌లువురు నేత‌ల‌కు చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఇదివ‌ర‌కు ఎన్నుకున్నందుకు ఏం చేశారంటూ ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. ప‌లు చోట్ల త‌మ దారుణ ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ.. వాటిని ప‌రిష్క‌రిస్తేనే ఓట్లు వేస్తామంటూ చెబుతున్నారు. 

ఈ నేప‌థ్యంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఓ గ్రామంలో అధ్వానమైన రోడ్ల‌ను గురించి గ్రామస్థులు నిరసన బాట పట్టారు. "నో రోడ్ నో ఓట్" అంటూ రోడ్లు కోసం ఎన్నికలను బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. రోడ్లు బాగు చేస్తేనే ఓట్లు వేస్తామంటూ అల్టీమేటం జారీ చేశారు. వేయి మందికి సైగా జ‌నాభా ఉన్న ఆ గ్రామం మొత్తం నిర‌స‌న‌కు సైతం దిగారు. వివ‌రాల్లోకెళ్తే.. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈఠ్ సర్దార్ నియోజకవర్గంలోని కుల్లా హబీబ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి బీజేపీకి చెందిన విపిన్ వ‌ర్మ డేవిడ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ప్రస్తుతం జ‌ర‌గనున్న ఎన్నిక‌ల్లోనూ బీజేపీ ఈ స్థానం నుంచి ఆయ‌న‌నే బ‌రిలోకి దించింది. ఈ క్ర‌మంలోనే త‌మ గ్రామ అభివృద్దిని గాలికి వ‌దిలేసిన అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల తీరును నిర‌సిస్తూ..  ఆందోళ‌న‌కు దిగారు. తమ గ్రామ రహదారులను బాగు చేయకపోతే  ఈ ఎన్నిక‌ల‌ను బాయ్ కాట్ చేస్తామంటూ హెచ్చరించారు. 

కుల్లా హబీబ్‌పూర్ గ్రామంలో మొత్తం 1000 మందికి పైగా నివాసితులు ఉంటారు. గ్రామంలోని రోడ్ల దుస్థితిని గురించి.. శుక్రవారం నాడు వీరు నిర‌స‌న‌కు దిగారు.  "రోడ్ నహిన్ తో ఓటు నహిన్ (నో రోడ్ నో ఓటు)" అని నినాదాలు చేశారు. మెరుగైన రోడ్లు వేయ‌క‌పోతే ఈ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తామంటూ హెచ్చ‌రించారు. వర్షాలు కురిస్తే, రోడ్లు జలమయమై గ్రామస్తులు తమ రోజువారీ పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని స్థానికుడైన పర్మోద్ కుమార్ మీడియాతో అన్నారు. అంతేకాకుండా పెద్దపెద్ద గుంతలు ఏర్పడి అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారనీ, దీని గురించి పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేస్తేనే ఎన్నిక‌ల్లో ఓట్లు వేస్తామ‌నీ, లేకుండా ఎల‌క్ష‌న్ ను బ‌హిష్క‌రిస్తామ‌ని తెలిపారు. త‌మ డిమాండ్ల‌తో కూడిన బ్యాన‌ర్ ను ప‌ట్టుకుని గ్రామ‌స్తులు నిర‌స‌న‌కు దిగారు. 

ఈ ఘ‌ట‌న‌పై సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(సదర్) శివకుమార్ సింగ్ మాట్లాడుతూ.. కాశీరామ్ కాలనీ వాసులు నీటి ఎద్దడి సమస్యపై నిరసనకు దిగారు. ఎన్నికలను బహిష్కరించాలని కూడా మాట్లాడుతున్నార‌ని అన్నారు. "తహసీల్దార్‌ను పంపాను, వారి సమస్యను త్వరలో పరిష్కరిస్తాను" అని ఎస్‌డిఎం చెప్పారు. దీనిపై తహసీల్దార్‌తో కలిసి విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తామ‌ని తెలిపారు. 

click me!