అత్యాచారం కేసులో మిర్చి బాబా అరెస్ట్.. హోటల్ గదిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు..

By Sumanth KanukulaFirst Published Aug 9, 2022, 4:16 PM IST
Highlights

మిర్చి బాబాగా పిలవబడే బాబా వైరాగ్యానంద్ గిరిని మధ్యప్రదేశ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అత్యాచార ఆరోపణలపై మిర్చి బాబాను అరెస్ట్ చేసినట్టుగా ఏఎన్‌ఐ వార్తాసంస్థ రిపోర్ట్ చేసింది. 

మిర్చి బాబాగా పిలవబడే బాబా వైరాగ్యానంద్ గిరిని మధ్యప్రదేశ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అత్యాచార ఆరోపణలపై మిర్చి బాబాను అరెస్ట్ చేసినట్టుగా ఏఎన్‌ఐ వార్తాసంస్థ రిపోర్ట్ చేసింది. గ్వాలియర్‌లోని ఓ హోటల్‌ నుంచి బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్చి బాబాను అరెస్ట్ చేసేందుకు భోపాల్ పోలీసులు, గ్వాలియర్ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. మిర్చి బాబాను అరెస్ట్ చేసిన తర్వాత భోపాల్ పోలీసులకు అప్పగించినట్టుగా గ్వాలియర్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ సంఘీ తెలిపారు.

మిర్చి బాబా తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మధ్య వయస్కురాలు సోమవారం సాయంత్రం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కథనం ప్రకారం.. ఆమె ఈ ఏడాది జూలైలో బాబాను కలిసింది. సంతానం కోసం ఆశీర్వాదం తీసుకోవడానికి  బాబా వద్దకు వెళ్లింది. అయితే ఈ క్రమంలోనే బాబా మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక, మిర్చి బాబాపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశామని.. విచారణ జరుపుతున్నామని భోపాల్ ఏసీపీ నిధి సక్సేనా తెలిపారు.

ఇక, మిర్చి బాబా.. తనను తాను దైవంగా ప్రకటించుకున్నాడు. 2019  లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ విజయం కోసం యజ్ఞం చేశాడు. ఆ ఎన్నికలో దిగ్విజయ్ సింగ్ ఓడిపోతే 'జల్ సమాధి' తీసుకుంటానని ప్రకటించాడు. ఆ ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్ ఓడిపోవడంతో.. మిర్చి బాబా జల సమాధిపై పలువురు ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత మిర్చి బాబా అదృశ్యమయ్యాడు. అయితే తన న్యాయవాది ద్వారా భోపాల్ కలెక్టర్ నుంచి జల సమాధి కోసం అనుమతి కోరారు. అయితే దానిని కలెక్టర్ తిరస్కరించారు.

click me!