మాజీ సీఎం బంధువు హత్య కేసు: సిద్ధార్థ్ తండ్రి రెండో భార్య అరెస్టు

By telugu teamFirst Published Feb 5, 2021, 10:27 AM IST
Highlights

కర్ణాటక మాజీ సీఎం ధరమ్ సింగ్ సమీప బంధువు సిద్ధార్థ సింగ్ హత్య కేసు చిక్కుముడి వీడింది. ఈ కేసులో పోలీసులు సిద్దార్థ్ సింగ్ సవతి తల్లి ఇందూ చౌహాన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ సమీప బంధువు సిద్ధార్థ్ సింగ్ హత్య కేసు చిక్కు ముడి వీడింది. 28 ఏళ్ల సిద్ధార్థ్ హత్య కేసులో పోలీసులు ఆయన తండ్రి దేవేందర్ సింగ్ రెండో భార్యను, అంటే సవతి తల్లి ఇందూ చౌహాన్ అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి చెందిన శ్యామ్ సందర్ రెడ్డికి, వినోద్ కు సుపారీ ఇచ్చి ఆమె సిద్ధార్థ్ ను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బెంగళూర్ ఈశాన్య విభాగం డీసీపీ సి.కె. బాబా చెప్పారు.

బుధవారం రాత్రి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని గురువారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. జనవరి 19వ తేదీన సిద్ధార్థను కిడ్నాప్ చేసి, కారులోనే సీటు బెల్టు గొంతుకు బిగించి నిందితులు అరెస్టు చేశారు. తిరుపతికి వెళ్దామని చెప్పి వారు సిద్ధార్థ్ తమ వెంట తీసుకుని వచ్చారు. 

 

సిద్ధార్థ్ హత్య కేసులో సవతి తల్లి ఇందూ అరెస్టు pic.twitter.com/kKMLiPjmq6

— Asianetnews Telugu (@AsianetNewsTL)

హత్య చేసిన తర్వాత సిద్ధార్థ శవాన్ని నెల్లూరు జిల్లా రాపూరు అటవీ ప్రాంతానికి తీసుకుని వచ్చి పూడ్చి పెట్టారు. తహసీల్దార్ సమక్షంలో పోలీసులు శవాన్ని వెల్కి తీసి పోస్టుమార్టం చేసి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

ఆమెరికాలో చదువుకున్న సిద్ధార్థ అమృతహళ్లి అపార్టుమెంటులో ఒంటరిగా ఉండేవాడు. ఆయన ఒక అంకుర పరిశ్రమను నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య వెనక మరికొంత మంది హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

కాగా, హత్య చేసిన తర్వాత పోలీసులకు తెలిసిపోయిందనే భయంతో శ్యామ్ సుందర్ రెడ్డి తిరుపతిలో ఉరేసుకుని మరణించాడు. వినోద్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. అయితే, అతను గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు వినోద్ ను అరెస్టు చేసి హత్యకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు. దీంతో కేసులో చిక్కు ముడి వీడుతూ వచ్చింది. 

click me!