
ఓ ట్యూషన్ టీచర్ చిన్నారి పట్ల కర్కషంగా ప్రవర్తించాడు. తన వద్దకు వచ్చిన ఓ విద్యార్థినిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం స్పెల్లింగ్ చెప్పలేకపోయిందన్న కారణంతో బాలిక చేయి విరగ్గొట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వెలుగులోకి వచ్చింది. దీంతో టీచర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోపాల్ సిటీలోని హబీబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ - 6 అరేరా కాలనీకి చెందిన భానుప్రతాప్ కు ఐదేళ్ల కూతురు ఉంది. ఆ బాలిక ఎప్పటిలాగే డిసెంబర్ 27వ తేదీన కూడా స్థానికంగా ఉండే ట్యూషన్ టీచర్ ప్రయాగ్ విశ్వకర్మ దగ్గరకు ప్రైవేట్ ట్యూషన్ కోసం వెళ్లింది.
ఆ సమయంలో టీచర్ ఆ బాలికను ఇంగ్లీష్ లో చిలుక స్పెల్లింగ్ చెప్పాలని కోరాడు. కానీ ఆ చిన్నారి చెప్పలేకపోయింది. దీంతో ఆగ్రహంతో ఆ టీచర్ బాలిక చెంపదెబ్బ కొట్టాడు. అలాగే చేయిని పట్టుకొని తిప్పాడు. దీంతో ఆ చేయి విరిగిపోయింది. ఆ బాలిక ట్యూషన్ నుంచి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చింది. పాప ముఖం, చేతులపై గాయాలు ఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. దీంతో ఏం జరిగిందని వారు ఆరా తీశారు. దీంతో తనను ట్యూషన్ టీచర్ కొట్టాడని చెప్పింది.
చేతికి నొప్పి ఎక్కువగా ఉండటంతో తండ్రి భానుప్రతాప్ వెంటనే కూతురును డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. డాక్టర్ పాపను పరీక్షించి ఎక్స్ రే తీయాలని సూచించారు. ఆ రిపోర్ట్ లో చిన్నారి చేతికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో బాలికకు ట్రీట్ మెంట్ అందించారు. ఈ ఘటనపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు.
అనంతరం నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రయాగ్ విశ్వకర్మ వయస్సు 21 సంవత్సరాలని పోలీసులు తెలిపారు ఆ యువకుడు కాలేజీలో చదువుకుంటున్నాడు. పార్ట్ టైమ్ గా పిల్లలకు ట్యూషన్ చెబుతుంటాడు. కాగా.. నిందితుడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 323, జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 సెక్షన్ 75 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెండు సెక్షన్లు బెయిలబుల్ కింద ఉన్నాయి. ఇదిలా ఉండగా భోపాల్‌లోని అనేక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, ప్రైవేట్ స్కూల్ లో తరచూ ఇలాంటి ఘటనలు జరిగినట్టు నివేదికలు వస్తుంటాయి.
ఇలాంటి ఘటనే ఈ ఏడాది సెప్టెంబర్ లో రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. జోద్ పూర్ లోని బోరుండా ఉన్న డాక్టర్ రాధాకృష్ణన్ సీనియర్ సెకండరీ స్కూల్ లో ఆకాశ్ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సెప్టెంబర్ 16వ తేదీన ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లాడు. అయితే ఆ బాలుడు హోం వర్క్ చేయలేదని రామ్ కరణ్ అనే టీచర్ తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలుడి శరీరంపై తీవ్రగాయాలు అయ్యాయి. అయితే ఆ విద్యార్థికి జ్వరం, తల, చెవిలో నొప్పి రావడంతో ఓ బంధువు ఇంటికి తీసుకొచ్చాడు. కుటుంబ సభ్యులు తమ కుమారుడిని స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి వైద్యులు బాలుడిని మెరుగైన చికిత్స కోసం జోధ్ పూర్ లోని మరో హాస్పిటల్ కు రిఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.